న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) కొత్త జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబిన్(45 ఏళ్లు) నియమితులయ్యారు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, ఇతర పార్టీ నాయకుల సమక్షంలో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నితిన్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. షా, నడ్డా, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా పలువురు నాయకులు పార్టీ కార్యాలయంలో ఆయనకు స్వాగతం పలికారు. “నితిన్.. చురుకైన వ్యక్తి, సైద్ధాంతికంగా దృఢమైనవాడు. పార్టీ పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి” అని పార్టీ నాయకులు తెలిపారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా నితిన్ కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, బిజెపి దివంగత సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు నితిన్ నబిన్. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నబిన్, బీహార్‌లోని బాంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో బీహార్ ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం కూడా ఉంది.