చట్టంలో సంస్కరణతోనే ఆటకట్టు
రాజ్యసభలోలో బిఆర్‌ఎస్ ఎంపి సురేష్ రెడ్డి
తమ పార్టీకి కల్గిన నష్టంపై ఎంపి సురేష్ రెడ్డి ప్రస్తావన
చిన్న రాష్టాలకు శాపంగా పార్టీల మార్పిడి
న్యూఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పదును పెట్టాలి, పూర్తి స్థాయిలో సంస్కరించాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రజాతీర్పును గౌరవించేలా చూడాల్సి ఉందని పిలుపు నిచ్చారు. సోమవారం ఈ అంశంపై ఎగువ సభలో చర్చలో బిఆర్‌ఎస్‌కు చెందిన కెఆర్ సురేష్ రెడ్డి, సిపిఎం సభ్యులు జాన్ బ్రిట్టాస్ మాట్లాడారు. ఫిరాయింపులు యద్ఛేచ్ఛగా సాగడం ఎన్నికల ప్రక్రియలోని స్వచ్ఛతకు భంగకరం అని బిఆర్‌ఎస్ ఎంపి సురేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వాగ్దానాలకు కట్టుబడి ఉండకపోవడం నజానికి ఓటర్ల కంట్లో దుమ్ము కొట్టడమే అవుతుందని విమర్శించారు. ఫిరాయింపుల చట్టం సరిగ్గా లేకపోవడంతో కొందరు ప్రజా ప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్పందించారు. రెండుసార్లు రాజ్యాంగ సవరణలు జరిగినా ఇప్పటికీ ఫిరాయింపులు సాగుతూనే ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద సవాలు అవుతుందని సురేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియ కాగానే ఓటర్ల బాధ్యత తీరిపోలేదని, వారు ప్రజా ప్రతినిధులను నిలదీసే విధంగా చట్టాలు ఉండాలని తెలిపారు.
అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎన్నికలు ముగియగానే అసలు కథ, నాటకాలు ఆరంభం అవుతాయని వ్యాఖ్యానించారు. చిన్న రాష్ట్రాలలో సాగుతోన్న పార్టీ ఫిరాయింపులు పలు అనర్థాలకు దారితీస్తున్నాయని అన్నారు. తెలంగాణలో తమ పార్టీ బిఆర్‌ఎస్‌కు ఈ ఫిరాయింపులతో జరిగిన నష్టాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. వెంటనే ఫిరాయింపుల చట్టంలో సమగ్రమైన సంస్కరణలను తమ పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో చట్టసభలలో సమగ్ర రీతిలో వ్యవహరించే సాధికారిక కమిటీ ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈ లోపంతోనే ఇప్పుడు న్యాయస్థానాలు ఈ విషయంలో స్పందించాల్సి వస్తోందని చెప్పారు.
ఫిరాయింపుల నిరోధానికి ఎప్పటికప్పుడు ఎందుకు స్పందించలేకపోతున్నామని ప్రశ్నించారు. ఇప్పటికే కోర్టులపై ఎంతో భారం ఉంది. చట్టసభల పనిని కోర్టులకు అప్పగించాల్సి వస్తోందని తెలిపారు. పార్లమెంటరీ పరిధిలోకి వచ్చే విషయాన్ని మనంతట మనమే తీసుకువెళ్లి సుప్రీంకోర్టు లేదా ఇతర న్యాయస్థానాల చేతిలో పెడుతున్నామని అన్నారు. ఓ పార్టీ టికెటుపై గెలిచి తరువాత ఇంకో పార్టీలోకి మారిన వారికి ప్రజల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉంటుందని ప్రశ్నించారు. ఒక పార్టీ తరఫున ఎన్నికల వాగ్దానాలకు దిగిన వారు వేరే పార్టీలోకి వెళ్లిన తరువాత ఇక ప్రజలకు ఏ కోణంలో న్యాయం చేస్తారని నిలదీశారు. నిజానికి ఓటు చోరీ అనేది వేరే లేదు. ఎన్నికల హామీలను గాలికి వదిలిపెట్టడం, ఫిరాయింపులకు దిగడమే బడా ఓటుచోరీ అని విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టంతో చిల్లర ఫిరాయింపులు ఆగాయి కానీ హోల్‌సేల్‌గా , మూకుమ్మడిగా పార్టీలు మారడం ఎక్కువ అయిందని సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ తెలిపారు.