పాట్నా ః బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం వివాదాస్పద రీతిలో వ్యవహరించారు. అధికారిక కార్యక్రమంలో ఓ మహిళా ఆయుష్ డాక్టర్ మేలిముసుగు (హిజాబ్) తొలిగించి చూశారు. సంబంధిత డాక్టర్లకు నియామక పత్రాలను అందించేందుకు ఏర్పాటు అయిన సభలో చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తింది. దీనితో సిఎం తీరుపై విమర్శలు జోరందుకున్నాయి. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ ముఖ్యమంత్రి వైఖరి జుగుప్సాకరంగా ఉందని విమర్శించారు. ఆయన ఫక్కా సంఘీగా మారారని, ఇప్పుడు జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్ చేసింది. ఇటీవలి కాలంలో ఆయుషు డాక్టర్లుగా కొందరిని ఎంపిక చేశారు. మహిళా డాక్టర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. పత్రాలు అందిస్తున్న దశలో తన ఎదుటికి హిజాబ్‌తో వచ్చిన నుస్రత్ పర్వీన్ ముసుగును సిఎం తొలిగించారు. ముందు ముఖం ముసుగు తీయమ్మా అంటూనే తానే ఈ పనిచేశారు. వెంటనే ఇది కెమెరాల క్లిక్‌లతో వీడియోగా మారింది. సిఎం చేసిన పనికి నుస్రత్ కంగుతింది. అక్కడున్న వారు నవ్వుతూ ఉండటం కన్పించింది.
ఈ వీడియోను రాష్ట్ర ఆర్జేడీ నేతలు సామాజిక మాధ్యమాలలో పొందుపర్చారు. నితీష్‌కు ఏమైంది? ఆయన మానసిక స్థితి పూర్తిగా దిగజారిందా? చిత్తచాంచల్యం ఏర్పడిందా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ సగం సగంగా అనుకుంటూ వస్తే ఇప్పుడు సిఎం నితీశ్ నూటికి నూరుపాళ్లు సంఘీ అయ్యారని విమర్శించారు. సిఎం తీరు బాగాలేదని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఓ ముస్లిం మహిళను అవమానించిన సిఎం రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేసింది. సిఎం స్థాయి వ్యక్తి ఈ విధంగా చేస్తే, మహిళను గేలిచేస్తే ఇక రాష్ట్రంలో వారికి భద్రతా ఉంటుందా? అని పార్టీ నిలదీసింది. కష్టపడి చదివి డాక్టరు అయిన ముస్లిం మహిళ పట్ల ముఖ్యమంత్రి ఇంత దిగజారుడుగా వ్యవహరించడం సిగ్గుచేటు అని పార్టీ పేర్కొంది. ఏకంగా సిఎం ఓ సభలో ముస్లిం హిజాబ్‌ను తీసివేస్తే సామాజికంగా దీని సంకేతాలు ఏ విధంగా వెలువడుతాయని పార్టీ వర్గాలు ప్రశ్నించాయి. ఇది మరీ మితిమీరిన దుష్ప్రవర్తన, సిగ్గుచేటు వ్యవహారం , క్షమించరానిదని స్పందించారు. జరిగిన ఘటనపై అధికార వర్గాల నుంచి కానీ సిఎం నుంచి కానీ ఎన్‌డిఎ వర్గాల నుంచి కానీ ఎటువంటి స్పందనా వెలువడలేదు.