కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వృషభ’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అప్పా..’ అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తండ్రీకొడుకుల మధ్య ఉండే పవిత్రమైన, గొప్ప అనుబంధాన్ని తెలియజేసే ఈ పాట సినిమాకు ఆత్మ, వెన్నెముక లాంటిది. సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాటను హిందీ, కన్నడ, తెలుగులో విజయ్ ప్రకాశ్.. మలయాళంలో మధు బాలకృష్ణన్ పాడగా, సాహిత్యాన్ని మలయాళంలో వినాయక్ శశికుమార్, తెలుగులో కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, హిందీలో కార్తీక్ ఖుష్, కన్నడలో నాగార్జున శర్మ అందించారు. డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ మూవీని నంద కిషోర్ తెరకెక్కిస్తున్నాడు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ద్వారా తండ్రీ కొడుకుల మధ్య ఉండే బలమైన, భావోద్వేగా బంధం గురించి మేం చెప్పాలని అనుకున్నాం. దాన్ని ఈ పాట ద్వారా చూపించాం’ అని అన్నారు. మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో సమర్జీత్ లంకేశ్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్సి, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై ‘వృషభ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.