న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా-టీమిండియా జట్ల మధ్య టీ20 సిరీస్ రసవత్తరంగా జరుగుతుంది. ఈ సిరీస్ లో భారత్ 2-1తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన టీ20 మ్యాచ్ ల నుండి తప్పుకున్నాడు. “టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మిగిలిన రెండు ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ టీ20ల నుండి తప్పుకున్నాడు. అయితే, అతను లక్నోలో జట్టుతోనే ఉన్నాడు. అక్కడ అతనికి తదుపరి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు” అని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. లక్నో, అహ్మదాబాద్‌లలో జరిగే టీ20ల కోసం అక్షర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది.
ఇక, మొదటి రెండు మ్యాచ్‌లలో ఆడిన అక్షర్.. ధర్మశాల స్టేడియంలో జరిగిన మూడవ టీ20లో అనారోగ్య కారణంగా ఆడలేదు. అనారోగ్యం కారణంగా మూడవ టీ20లో విశ్రాంతి ఇచ్చినట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తోపాటు బీసీసీఐ ఈ విషయాన్ని ధృవీకరించింది.”మేము రెండు తప్పనిసరి మార్పులు చేశాము. అక్షర్ పటేల్ అనారోగ్యంతో ఉన్నందున, జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల వల్ల జట్టుకు దూరమయ్యారు. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు” అని మూడవ టీ20లో టాస్ గెలిచిన తర్వాత సూర్య చెప్పాడు.
మ్యాచ్ విషయానికొస్తే, భారత్ మూడవ టీ20లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 25 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 35 పరుగులు చేసి మరోసారి తన సత్తా చాటాడు. ఇక, డిసెంబర్ 17న లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాల్గవ టీ20 మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
చివరి రెండు T20Iలకు భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (C), శుభ్‌మాన్ గిల్ (VC), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, జితేష్ శర్మ (WK), సంజు సామ్సన్ (WK), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్.