గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా నిలిచారనే కోపంతో గెలిచిన సర్పంచ్ తమ్ముడు ఐదుగురిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం. సోమార్‌పేట్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్థుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతో గ్రామ సర్పంచ్‌గా గెలిచిన కురుమ పాపయ్య తమ్ముడు కురుమ చిరంజీవి ట్రాక్టర్ తో రెండుమూడుసార్లు ఐదుగురుపి ఢీకొట్టాడు. ఈ సంఘటపలె గంజి భారతి (59), బండమీది బాలమ్మ (40), పద్మ సత్యవ్వ (56), తోట శారద (30), గంజి అద్విక్ (5) తీవ్ర గాయాలపాలయ్యారు. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ గంజి భారతి, బండమీది బాలమ్మ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మండలంలోని సోమార్‌పేట్ గ్రామ సర్పంచ్‌గా కురుమ పాపయ్య 49 ఓట్ల తేడాతో బిట్ల బాలరాజుపై విజయం సాధించాడు. ఎన్నికల్లో విజయం సాధిస్తే పటేల్ చెరువు మైసమ్మ వద్ద మేకను కోస్తానని పాపయ్య మొక్కుకున్నాడు.
వంట సామగ్రిని తీసుకెళ్లేందుకు పొలంలో ఉన్న ట్రాక్టర్‌ను తీసుకురావాల్సిందిగా తన సొంత తమ్ముడు కుర్మ చిరంజీవికి పురమాయించాడు. చిరంజీవి ట్రాక్టర్ తీసుకువస్తుండగా అదే దారిలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజు ఇల్లు ఉంది.బాలరాజు ఓటమిపాలు కావడంతో ఆయనను పరామర్శించడానికి అతని మద్దతుదారులు ఇంటిముందు సుమారు ఉదయం 10 గంటల సమయంలో గుమిగూడూరు. ట్రాక్టర్‌పై వస్తున్న చిరంజీవి వారిని చూడగానే వారంతా తన అన్నకు వ్యతిరేకులనే ఆగ్రహంతో తిట్ల దండకం అందుకున్నాడు. ఆ ఇంటి ముందు ఉన్న మహిళలపైకి ట్రాక్టర్‌తో ఢీకొన్నాడు. దీంతో మహిళలు హాహాకారాలు చేసినా.. ఆగ్రహంతో ఉన్న చిరంజీవి ట్రాక్టర్ రివర్స్ తీసుకెళ్లి రెండుసార్లు వాళ్లపై నుంచి ట్రాక్టర్ పోనిచ్చాడు. ట్రాక్టర్ టైర్లు సైతం గంజి భారతి పైనుంచి వెళ్లి గోడకు ఢీకొట్టి నిలిచిపోయింది. ట్రాక్టర్ ఢీకొట్టడంతో బండమీది బాలమ్మ, పద్మ సత్యవ్వ, తోట శారద, గంజి అద్విక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రులు ఐదుగురిని స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. నిందితుడు చిరంజీవిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వందలాదిగా ఆసుపత్రికి చేరుకున్నారు. ట్రాక్టర్ పైనుంచి పోవడంతో గంజి భారతి పక్క బొక్కలు, నడుము, వెన్నుపూసకు తీవ్ర గాయాలయ్యాయి.
బండమీది బాలమ్మ ఎడమ చేతి పైనుంచి డాక్టర్ టైర్ ఎక్కడంతో బొక్కలు నుజ్జునుజ్జు అయ్యాయి. వీరిద్దరినీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. పద్మ సత్యవకు దవడ ముఖంపై గాయాలు కాగా, తోట శారదకు చేతులు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదేళ్ల వయసున్న చిన్నారి గంజి అద్విక్కు ఎడమకాలు విరిగిపోయింది. ఓడిన సర్పంచ్ అభ్యర్థి రాజు చెయ్యికి స్వల్ప గాయమైంది. వీరి పరిస్థితి చూసిన గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విషయం తెలిసిన వందలాదిమంది ఆసుపత్రి పరిసర ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకొని బందోబస్తు చేపట్టారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబాకు నిందితుడు చిరంజీవి చిన్నాన్న కావడంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు.
నాలుగున్నర గంటల పాటు రాస్తారోకో:
కాంగ్రెస్ పార్టీకి చెందిన కురుమ సాయిబాబా, గ్రామ సర్పంచ్ కురుమ పాపయ్య, నిందితుడు కురుమ చిరంజీవిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండలాల మంది గ్రామస్థులు రోడ్డెక్కారు. ప్రైవేట్ ఆస్పత్రికి దగ్గరలో ఉన్న రామాలయం ముందు రోడ్డుకు అడ్డంగా కూర్చుని నాలుగున్నర గంటలపాటు రాస్తారోకో జరిపారు. స్థానిక శాసనసభ్యుడు మదన్మోహన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కురుమ సాయిబాబాను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గెలిచిన సర్పంచ్ కురుమ పాపయ్య రాజీనామా చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వారు ఆందోళన విరమించలేదు. మహిళలు, వృద్ధులు, యువకులు, గ్రామానికి చెందిన వందలాది మంది ఏకతాటిపై ఆందోళన చేపట్టారు..
కఠిన చర్యలు తీసుకోకుంటే మళ్లీ ఆందోళన:
సోమార్పేట్ గ్రామంలో ఐదుగురిని ట్రాక్టర్ తో ఢీకొట్టి హతమార్చడానికి ప్రయత్నించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ శాసనసభ్యుడు జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. ఈ దారుణ సంఘటన తెలుసుకున్న ఆయన నేరుగా హైదరాబాద్ నుంచి వచ్చి రాస్తారోకో చేస్తున్న వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అరాచకం పెరిగిపోయిందని, రౌడీయిజం పెరిగిపోయిందని అన్నారు. ఓడిపోయిన తమ పార్టీ అభ్యర్థి మద్దతుదారులను చంపడానికి ప్రయత్నించడం హేయమైన చర్య అన్నారు. దీని వెనుక ఉన్న అందరిపై విచారణ జరిపి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచి 24 గంటలు కాకముందే దౌర్జన్యాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే రాస్తారోకోలో కూర్చుండడంతో వివిధ గ్రామాల నుంచి బిఆర్‌ఎస్ కార్యకర్తలు వచ్చి చేరారు. పరిస్థితి విషమించడంతో స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజారెడ్డి మాజీ ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తానని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హామీ ఇస్తే ఆందోళన విరమిస్తానని మాజీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
దీంతో సిఐ రాజిరెడ్డి జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్పీ సెల్ఫోన్లో మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మాజీ ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆయన ఆందోళన విరమించారు. బాధితులకు న్యాయం జరగాకుంటే మళ్లీ ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఎస్పీ హామీతో ఆందోళన విరమించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ ఎమ్మెల్యే సురేందర్ పరామర్శించారు. దీంతో పోలీసులు రాస్తారోకో చేస్తున్న మిగతా వారికి నచ్చజెప్పి రాస్తారోకో విరోమింపజేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాస్తారోకో సాయంత్రం 4:00 వరకు కొనసాగింది. దీంతో రోడ్డుపై వందల వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిఐ రాజిరెడ్డి ఎస్‌ఐ మహేష్‌తో పాటు ఎల్లారెడ్డి కామారెడ్డి, డివిజన్‌కు చెందిన పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.