కాంగ్రెస్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీని బెదిరిస్తూ నినాదాలు చేయడం మంచి పద్ధతి కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ పేరిట ఏఐసిసి అధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మహా ధర్నా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు ఢిల్లీలో వీధుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఈ నినాదాల్లో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం ట్వీట్ చేశారు. ‘మోడీ తేరీ ఖబర్ ఖోదేగీ’ అని నినాదాలు చేయడం బాధాకరమని ఆయన తెలిపారు. దేశ భద్రత, గౌరవం, అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ రాత్రింభవళ్ళు కష్టపడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరించేలే నినాదాలు చేయడం ఎంత వరకు భావ్యమని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభ వేదికగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.