కడుపున పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే తన పేగు బంధాన్ని తెంచుకుని, డబ్బు కోసం నడిబజారులో విక్రయించింది. నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణం సమాజాన్ని నివ్వెరపరిచేలా చేసింది. అత్యంత గోప్యంగా జరిగిన ఈ బాలిక విక్రయం బేరంపై పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, పసికందును సురక్షితంగా రక్షించి, ఐదుగురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లా కేంద్రానికి చెందిన ఓ తల్లి, తన చిన్నారిని విక్రయించాలని పన్నాగం పన్నింది. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల పేరు చెప్పి, తన కన్నబిడ్డను అమ్ముకునేందుకు తెగించింది. ఈ అమానుష బేరానికి పుణెకు చెందిన కొందరు ముందుకు వచ్చారు.
స్థానిక మధ్యవర్తుల ద్వారా ఈ అకృత్యానికి తెరలేపారు. లక్షల్లో జరిగినట్టుగా భావిస్తున్న ఈ అక్రమ లావాదేవీలో, పసిపాపను కొనుగోలు చేసిన పుణె గ్యాంగ్‌కు తల్లి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ బాగోతంపై విశ్వసనీయ వర్గాల ద్వారా పక్కా సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీసులు, వెంటనే అప్రమత్తమై ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఈ బాలిక విక్రయానికి సహకరించిన కీలక మధ్యవర్తులను, ఆ కన్నతల్లిని, పాపను కొనుగోలు చేసిన పుణెకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్టు సమాచారం.