మెదక్: మెదక్ మండలం చీపురుదుబ్బ తండా గ్రామ సర్పంచి ఎన్నిక ఫలితం డ్రాలో తేలింది. ఈ చీపురుదుబ్బతండా పంచాయతీకి మోటు కాడి తండా, నైలి తండా అనుబంధంగా ఉన్నాయి. మొత్తం 3 తండాల్లో కలిపి 377 ఓట్లు ఉండగా.. 367 ఓట్లు పోలయ్యాయి. అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన కేతావత్ సునీతకు 182, బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేసి బీమిలికి 182 ఓట్లు వచ్చాయి. ఇద్దరికి సమానంగా రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతను అదృష్టం వరించింది. దీంతో ఆమెను సర్పంచిగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
కాగా, సర్పంచి ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జోరు చూపిస్తోంది. ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపులో కాంగ్రెస్ 773 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బిఆర్ఎస్ 239, బిజెపి 77, ఇతరులు 213 స్థానాలు దక్కించుకున్నారు.