మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి ఏటా నకిలీ విత్తనాలతో రైతుల నష్టపోతుడంటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు నూతన విత్తన చట్టం 2025 ను తీసుకురానుంది. ఈ క్రమంలో విత్తన చట్టం కఠినంగా అమలు కాకుండా కార్పొరేట్ కంపెనీలు కుట్రలు చేస్తున్నాయనే ప్రచారం ఒక వైపు వినిపిస్తోంది. ఒకసారి చట్టం అమలు చేస్తే రైతులకు నాసిరకం విత్తనాలు, అమ్మకాలు చేసి అడ్డుగోలుగా దోచుకునే పరిస్థితులు ఉండబోవని కంపెనీలు భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో చట్టంలోని కొన్ని నిబంధనలను తొలగించి తమ నకిలీ విత్తన వ్యాపారానికి ఢోకా లేకుండా చూసుకునేందుకు కంపెనీలు పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ నూతన చట్టం రాష్ట్ర రైతులకు హని చేసేవిధంగా ఉందని సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ముసాయిదా బిల్లు కంపెనీలకే వత్తాసు పలికే విధంగా కేంద్రం రూపొందించిందని ఆరోపించారు. అయితే చట్టం రూపకల్పన పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ చెపుతోంది.
ఈ చట్టం పూర్తిగా రాష్ట్రాల అధికారాలు హరించే విధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ ఆరోపిస్తోంది. చట్టంలో నఖిలీ విత్తనాలతో రైతుల నష్టపోతున్న నేపథ్యంలో సదరు కంపెనీలు నుండి నష్టపరిహారం చెల్లించే విధంగా చట్టంలో నిబంధనలు ఉంటే విత్తనాల కంపెనీలు నాణ్యమయిన విత్తనాలు తయారు చేస్తాయని వ్యవసాయ శాఖ పేర్కొంటుంది. కంపెనీలపై నియంత్రణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ చేతిలోకి వెళ్లడంతో సామాన్య రైతులకు జరిగే న్యాయం ప్రశ్నార్ధకంగా మారనుంది. ముసాయిదాలో నూతన విత్తన తయారీలో కంపెనీలకు స్వీయ దృవీకరణకు అనుమతి ఇవ్వడం, స్థానిక వాతావరణ, ఇతర అనుకూలతలతో సంబంధం లేకుండా అనుమతులకు అవకాశం, దీంతో పాటు విత్తన కంపెనీలు విత్తనాల నాణ్యత, మెలక శాతం లాంటి అనేక పర్యవేక్షణలకు చెందిన నిబంధనలు కార్పొరేట్ కంపెనీలకు వరంగా మారాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లాలో గిరిజన రైతులు నష్టపోయిన తర్వాత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా విత్తన చట్టం రూపకల్పనకు నిర్ణయం తీసుకుంది.
భవిష్యత్ లో నకిలీ విత్తనాలు రాకుండా, కంపెనీల ఇష్టానుసారంగా అమ్మకాలు జరపకుండా కొత్త చట్టం చేయాలని నిర్ణయించింది. దీంతో ముసాయిదా కమిటీ సభ్యులు పలుమార్లు సమావేశమై విత్తన చట్టం ఏ విధంగా తీసుకొస్తే అన్నదాతలకు భరోసా లభిస్తుందనే విషయాలపై చర్చించారు. అయితే ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టన ముసాయిదాలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, రైతు కమిషన్‌లు పేర్కొంటున్నాయి. దీంతో పాటు బిల్లులో చేయాల్సిన సవరణలు కేంద్రానికి పంపాయి. బిల్లులో సవరణలు జరిగితే కంపెనీలకు నష్టం చేకూరుతుందని, అందుకే ఈ సవరణలు అడ్డుకునేందుకు కంపెనీలు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల కోసం సవరణలు చేయాల్సిందేనని కేంద్రానికి స్పష్టం చేసింది.