రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోతుంది. చాలా జిల్లాల్లో చలి ప్రభావానికి ప్రజలు వణికిపోతున్నారు. హైదరాబాద్ నగరం సహా పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణాగ్రతలు సింగిల్ డిజిట్‌కే పడిపోయాయి. తీవ్రమైన చలి గాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ముఖ్యంగా ఉదయం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గాలిలో తేమ శాతం పెరిగిపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పులతో చలి తీవ్రత పెరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పెరిగిన చలి తీవ్రత కారణంగా ప్రజలు జబ్బులు బారిన పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దుల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలు పెరిగాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చల్లటి వాతావరణంతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ జ్వరం, ఆయాసం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అస్తమా, సిఒపిడి (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డీసీజ్), అలర్జీ, న్యుమోనియా తదితర శ్వాసకోశ వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్ త్వరగా దాడి చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.