భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి వచ్చే యేడాదిలో నిర్వహించే కల్యాణ మహోత్సవానికి కోటి తలంబ్రాలకు వరికోతలు మొదలయ్యాయి. యేటా ఖమ్మం నగరానికి చెందిన శ్రీ లక్ష్మీబాలాజీ సేవా సమితి కోటి గోటి తలంబ్రాలు రాములోరికి అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్ 7న చింతకాని మండలం, వందనం గ్రామంలో వేములపల్లి సీతారాంబాబు పొలంలో సమితి ఆధ్వర్యంలో వరి పంట సాగు చేశారు. ఆ రాములోరి దయ వల్ల పంట బాగా పండి చేతికి వచ్చినట్లు సమితి అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి తెలిపారు. ఆదివారం సమితి సభ్యులతో కలిసి ఆ పంటను కోసినట్లు చెప్పారు. త్వరలో పలు ఆలయాల్లో ఈ వడ్లు వలిచేందుకు పంచనున్నట్లు తెలిపారు. ఈ వడ్లు వలిచే కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వడ్లు వలిచి కోటి గోటి తలంబ్రాల తయారీలో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని, తద్వారా ఆ సీతారామచంద్రస్వామి వారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి సభ్యులు విజయలక్ష్మి, రేవతి, మౌనిక, రజిత, విజయ, లక్ష్మి, శ్రావణి, రాము, పూర్ణ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.