ప్రజలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ ఫుట్ బాల్ కనిపించడం లేదా ? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చిన వెంటనే వాలిపోతానని చెప్పిన రాహుల్ గాంధీ ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ఆదివారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ప్రజల కష్టాల కంటే ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకే రాహుల్ గాంధీ ప్రాధాన్యం ఇచ్చారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల కష్టాలు వర్ణనాతీతం అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు విషాహారం తిని అస్వస్థతకు గురయ్యారని, పేదల ఇండ్లు కూలుస్తున్నారని, హత్యలు, అరాచకాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. వృద్దులకు పెన్షన్లు అందడం లేదని, విద్యార్థుల ఫీజు రీ-యంబర్స్‌మెంట్ జరగలేదని, రైతు బంధు విడుదల చేయలేదని, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, నాలుగు వందల ఇరవై హామీలు ఏమయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.