ధర్మశాల: సౌతాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా రెండో టి20లో ఓడిన టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మూడో టి20 ఇరు జట్లకు కీలకంకానుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలనే యోచనలో ఇరు జట్లు అమితమీకి సిద్ధమయ్యాయి. రెండో టి20లో ఆడిన జట్టునే సఫారీ టీమ్ మెనేజ్‌మెంట్ ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పేలవ ప్రదర్శనతో రెండో టి20లో ఓడిన టీమిండియా.. ఆ తప్పిదాలను సవరించుకొని మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తుంది. తొలి రెండు మ్యాచ్‌లు ఏకపక్షంగా ముగియడంతో మూడో టి20 హోరాహోరీగా మారనుందనే క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
బరిలోకి సంజూ..
తొలి రెండు టీ20ల్లో దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై వేటువేయనున్నట్టు తెలుస్తోంది. గిల్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతన్ని పక్కకు పెట్టాలనే యోచిస్తున్నట్లు గౌతమ్ గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గాయం నుంచి కోలుకొని ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇచ్చిన గిల్ జరిగిన రెండు టి20ల్లో 4, 0 పరుగుల పేలవ ప్రదర్శన చేశాడు. గిల్ కోసం అసాధారణ ప్రదర్శన కనబర్చిన సంజూ శాంసన్‌ను పక్కనపెట్టినా తీరు మారకపోవడంతో ఈ మ్యాచ్‌కు సంజూను జట్టులోకి తీసుకోనున్నారు. 14 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ చేసిన గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై చేసిన 47 పరుగులే గిల్‌కు బెస్ట్ స్కోరు. ఈ గణంకాల నేపథ్యంలోనే గిల్‌ను తప్పించి సంజూను ఓపెనర్‌గా కొనసాగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కానీ గిల్ టీమిండియా మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇవ్వచ్చు. ఒకవేళ గిల్‌ను పక్కనపెడితే సంజూ ఓపెనర్‌గా బరిలోకి దిగడం ఖాయం.
సూర్యాపైనే అందరి కన్ను..
మరో ఓపెనర్ భారీ షాట్లతో విరుచుకుపడినా పెద్దగా పరుగులు రాబట్టలేకపోయాడు. మూడో టి20లో అతను చెలరేగాల్సి ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి మరి దారుణం. గతేడాదిగా అతను తీవ్రంగా తడబడుతున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బ్యాట్ ఝులిపించాల్సిన అవసరం ఉంది. నాలుగో స్థానంలో తిలక్ వర్మ పర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌లో భారీ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. అక్షర్ పటేల్ తేలిపోయాడు. గాయం నుంచి కోలుకొని తొలి టి20లో సత్తా చాటిన హార్దిక్ పాండ్యా.. రెండో మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. శివమ్ ధూబే కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. జితేష్ శర్మ తన వంతు సహకారం అందిస్తున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీ సఫారీలు పరుగులు చేయకుండా కట్టడి చేస్తుండగా జస్ప్రీత్ బుమ్రా నిలకడగా రాణిస్తున్నాడు. అర్షదీప్ సింగ్ పేలవ బౌలింగ్ జట్టు పరాజయానికి కారణమయ్యాడు. ఇక మూడో టి20లో బాల్‌తో చెలరేగితే టీమిండియాకు విజయం సునయాసమనే చెప్పొచ్చు.
భారత జట్టు(అంచనా)..
శుభ్‌మన్ గిల్/సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, తిలక్ వర్మ, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ, అర్‌సదీప్ సింగ్.