ముంబై: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు దేశీయ క్రికెట్‌ను కుదిపేస్తున్నాయి. ఈ వ్యవహారంలో అమిత్ సిన్హా, ఇషాన్ అహ్మద్, అమన్ త్రిపాఠి, అభిషేక్ ఠాకూర్‌లను అస్సాం క్రికెట్ అసోసియేషన్(ఎసిఎ) గుర్తించి, విచారణ జరిపి నిర్ధారణ కావడంతో వారిపై తాత్కాలికంగా సస్పెన్సన్ వేటు వేసింది. ఆ నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు లక్నోలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ -2025 లీగ్ మ్యాచ్‌ల సమయంలో సహచర ఆటగాళ్లను ప్రభావితం చేసేందుకు వారు ప్రయత్నించారన్న అనుమానాలే ఈ చర్యకు కారణమని తెలుస్తోంది.
ఈ విషయాన్ని అస్సాం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సనాతన్ దాస్ అధికారికంగా వెల్లడించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ నలుగురిపై గువాహటిలోని క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ వ్యవహారంపై బిసిసిఐ అవినీతి నిరోధక విభాగం ఇప్పటికే ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. సస్పెండ్ అయిన ఆటగాళ్లలో అభిషేక్ ఠాకూర్ ఈ ఏడాది రంజీ ట్రోఫీలో అస్సాం తరఫున రెండు మ్యాచ్‌లు ఆడగా, మిగతా ముగ్గురు కూడా వివిధ స్థాయిల్లో అస్సాం జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.