తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా విస్తరిస్తూ, యువత జీవితాలను నాశనం చేస్తున్న సమస్యల్లో డ్రగ్స్ వినియోగం ముందువరసలో ఉంది. గతంలో పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాలకు, మెట్రో నగరాలకే పరిమితమైన ఈ జాడ్యం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు, పట్టణాలకు వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్టణం నగరాలలో డ్రగ్స్, గంజాయి వినియోగం బాగా పెరిగిందని పోలీసులు చెబుతున్నప్పటికీ, నిజానికి ఈ జాడ్యం ఉభయ రాష్ట్రాలలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు వ్యాపించిందనేది బహిరంగ సత్యమే. వాడుతున్న మత్తుమందుల్లో తేడా ఉండొచ్చేమో గానీ, మత్తు ప్రభావం మాత్రం చాపకింద నీరులా వేగంగా తెలుగు నేల మీద విస్తరిస్తోంది. నగర ప్రాంతాల్లో ఐటి, సేవా రంగాలకు చెందిన కార్పొరేట్ ఉద్యోగులు వారాంతాలలో పబ్‌లలో పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకోవటం కామన్‌గా మారగా, సినీ, వ్యాపార, ఇతర ఉన్నత వర్గాల యువత జీవన శైలిలో ఇదొక భాగంగా మారింది.
ముఖ్యంగా రేవ్ పార్టీల సంస్కృతి, గత ప్రభుత్వాల పట్టింపులేనితనం డ్రగ్స్ వినియోగం నానాటికీ పెరిగేందుకు దోహదపడ్డాయి. పదేళ్ల నాడు హైదరాబాద్‌లోని కొన్ని ఉన్నత వర్గాలకే పరిమితమైన డ్రగ్స్ వినియోగం నేడు రాజధాని శివారులోని ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలకూ పాకి, ఇప్పుడు జిల్లాల ప్రధాన పట్టణాలకూ విస్తరించింది. గంజాయి మొదలు కొకైన్ వినియోగానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అలవాటు పడ్డారని, చివరికి చాక్లెట్లు, లిక్విడ్ రూపంలోనూ వాడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. గతంలో కేసులు పెట్టి చేతులు దులుపుకోవటం తప్ప చేసిందేమీ లేదని, ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ కేసుల విచారణమీద ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉండటంతో నాటి కేసులు నిర్వీర్యమయ్యాయనేది బహిరంగ సత్యమే. అటు ఎపిలోని మన్యం నుంచి వేలాది కిలోల గంజాయి రవాణా సమయంలో ఇతర రాష్ట్రాలలో పట్టుబడింది. గత ఐదేళ్లలో నేతల అక్రమార్జనకు ఇదొక వనరుగా మారింది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా ఎపిలో గంజాయి వినియోగం పెరిగిపోయిందని పోలీసులు చెబుతున్నారు. దీనికి బానిసైన యువత పలు హింసాత్మక ఘటనలకు, దోపిడీలకూ పాల్పడటం జరుగుతోంది. గతంలో హై క్లాస్ రేవ్ పార్టీలు, పబ్బుల్లో మాత్రమే దొరికే డ్రగ్స్, గంజాయి వంటివి.. నేడు వీధి చివర కిరాణా దుకాణాలు, పాన్ షాపుల్లో పట్టుబడటం పోలీసుల మాటను బలపరుస్తోంది.
కింది స్థాయి వరకు ఇంతగా డ్రగ్స్ వినియోగం పాకిందంటే.. డ్రగ్స్ రవాణా, పంపిణీ వెనక ఒక బలమైన నెట్‌వర్క్ పనిచేస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. కానీ, నేటి వరకు డ్రగ్స్ వాడే వారినే అరెస్టు చేసి, కోర్టులో విచారణకు నిలపటం తప్ప డ్రగ్స్ రవాణ, పంపిణీలో కీలక సూత్రధారుల్లో ఒక్కరినీ పోలీసులు పట్టుకోలేకపోవటం వెనక బలమైన కారణాలే ఉన్నాయి. తెలంగాణలో గత ఏడాది కాలంగా తరచూ పోలీసులు హోటళ్లు, పబ్‌లమీద దాడులు, తనిఖీలు పెరిగాయి. తెలంగాణలోని సినిమా పరిశ్రమ ప్రభుత్వ సహకారం పొందాలంటే.. సినీ ప్రముఖులంతా డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాల్సిందేనని తెలంగాణ సిఎం గతంలోనే స్పష్టం చేశారు. పరిశ్రమలోని నటీనటులు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తయారయ్యే షార్ట్ ఫిలిమ్స్‌లో తమ సందేశాలను ఇవ్వాలని, వాటిని థియేటర్లు ఉచితంగా ప్రదర్శించాలని, అప్పుడే టికెట్ ధరలు పెంచటానికి అనుమతిస్తామని తనను కలిసిన సినీ పరిశ్రమ ప్రముఖులకు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో డ్రగ్స్ వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో తీసి పంపి మిగిలిన నటులకు ఆదర్శప్రాయులుగా నిలిచారు. అలాగే, తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోకు 27 కార్లు, 59 బైకులు సమకూర్చటం, డ్రగ్స్ కట్టడిలో చురుగ్గా పనిచేసే అధికారులకు ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించటమూ ఆహ్వానించదగిన పరిణామాలే.
డ్రగ్స్ వినియోగంపై సమాచారం తెలిసిన వారు 87126 71111 నంబరుకు ఫోన్ చేసి నార్కోటిక్స్ విభాగానికి సమాచారం ఇవ్వాలని కూడా సిఎం పిలుపునిచ్చారు. అటు ఎపిలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వమూ ఈ వ్యవహారంపై గట్టిగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే దీనిపై ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. గంజాయి సాగు చేసే వారి మీద చర్యలు తీసుకోవటమేగాక వారికి పెట్టుబడి పెడుతున్న వ్యక్తులెవరనే కోణంలోనూ విచారణ సాగుతోంది. తీరప్రాంతంలోని నౌకల నుంచి డ్రగ్స్ దిగుమతి కాకుండా చూడటం, ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు గట్టిగా నిఘా పెట్టాలని సూచించటం వంటి చర్యలు తీసుకున్నారు. గంజాయి సేవించి బహిరంగ ప్రదేశాల్లో ప్రజలమీద దాడులు చేస్తున్న బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకూ పోలీసులు చెక్ పెడుతున్నారు. ముఖ్యంగా ఎపిలో గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించే దిశగా సర్కారులోని సంబంధిత విభాగాలు అడుగులు వేస్తున్నాయి. మాదక ద్రవ్యాలను సరఫరా చేసేవారు సాధారణంగా యుక్త వయస్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, నూటికి 90 శాతం కేసుల్లో ఇది సిగరెట్, మద్యంతో అలవాటవుతోందని నిపుణులు చెబుతున్నారు. మాదకద్రవ్యాల సరఫరా ఒక చెయిన్‌లా సాగుతుందని, ఈ నెట్‌వర్క్‌ను బ్రేక్ చేయగలిగితే తొలినాళ్లలోనే చాలామందికి డ్రగ్స్ అందకుండా చూడొచ్చనేది వారి వాదన.
డ్రగ్ డీలర్లు ఉన్నత వర్గాల యువతను హైక్లాస్ పార్టీలకు పిలిచి ఉచితంగా మద్యం సరఫరాతో మొదలుపెట్టి, వారిని క్రమంగా డార్క్‌వెబ్‌కు కనెక్ట్ చేసి డెలివరీ బాయ్స్ ద్వారా డ్రగ్స్‌ను ఇంటికే సరఫరా చేస్తున్నారని కూడా తమ కౌన్సిలింగ్‌లో తెలుస్తోందని డిఎడిక్షన్ సెంటర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయిని మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా, ఆ పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, ఇలాంటి లక్షణాలు కనిపించగానే డిఅడిక్షన్ సెంటర్లను సంప్రదించి, చికిత్సతోపాటు మానసిక కౌన్సెలింగ్ కూడా అందించాలని వారు చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు కౌన్సిలింగ్, అవసరాన్ని బట్టి చట్టపరమైన చర్యలతో బాటు స్కూలు స్థాయి నుంచే విద్యార్థులకు ఆయా విద్యాసంస్థల్లో కౌన్సిలింగ్, అవగాహనా శిబిరాలు నిర్వహించాలని వారు సూచిస్తున్నారు. డ్రగ్స్ వినియోగం, పంపిణి, సరఫరామీద విశేషమైన ప్రచారం, అవగాహన ఉన్నప్పుడే డ్రగ్స్ వినియోగం కట్టడి అవుతుంది. దీనికోసం అటు ప్రభుత్వాలు, ఇటు స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రముఖులు, విద్యా సంస్థల యాజమాన్యాల చొరవ కూడా కీలకమే. ఈ గలీజు దందా నడిపే వారి పట్ల కఠినంగా ప్రభుత్వాలు వ్యవహరించగలిగితేనే ఈ జాడ్యం దూరమవుతుంది. లేదంటే.. ఈ జాడ్యం మొత్తం సమాజాన్ని పెకలించకమానదు. కనుక ఇకనైనా, మాదకద్రవ్యాల మీద పోరులో మన ప్రభుత్వాలు మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గోరంట్ల శివరామకృష్ణ
99852 16695