బ్రౌన్ విశ్వవిద్యాలయంలోని ఐవి లీగ్ క్యాంపస్ లో శనివారం నాడు ఒక అగంతకుడు జరిపిన కాల్పులలో ఇద్దరు మరణించగా, 9 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఫైనల్ పరీక్షల కోసం విద్యార్థులు హడావుడి పడుతున్న సమయంలో నల్లదుస్తులు ధరించిన షూటర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు అనుమానితుడికోసం వెతుకుతున్నారు. కాల్పుల సంఘటనపై యూనివర్సిటీ ప్రెసిడెంట్ క్రిస్టినా పాక్సన్ మాట్లాడుతూ కాల్పులలో పది మంది విద్యార్థులు తుపాకీ తూటాలవల్ల గాయపడినట్లు తనకు చెప్పారని, వారిలో ఇద్దరు మరణించారని పేర్కొన్నారు. కాగా, తూటాల వల్ల గాయపడిన మరో బాధితుడు విద్యార్థియా కాదా అన్నది నిర్థారించాల్సి ఉందన్నారు. శనివారం మధ్యాహ్నం కాల్పుల ఘటన తర్వాత, అనుమానితుడి కోసం పోలీసులు యూనివర్సిటీలోని చరిత్రాత్మక భవనాలతో పాటు, కాంపస్ మొత్తం గాలించారు.ఇంజినీరింగ్ భవనం వద్ద కాల్పులు జరిగాయి, కాల్పులు జరిపిన వెంటనే నల్లదుస్తులలో ఉన్న ఆ అగంతకుడు పరారయ్యాడు.
అతడికి 30 ఏళ్లు ఉండవచ్చునని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కెమెరాలలో ఆ యువకుడు పరారవుతున్నట్లు కన్పించినా, ముఖం గుర్తుపట్టేందుకు వీలుగా రికార్డు కాలేదని, కానీ అతడు పురుషుడేడని ప్రావిడెన్స్ పోలీసు డిప్యూటీ చీఫ్ తిమోతి ఓహారా తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి హ్యాండ్ గన్ ఉపయోగించాడు. ఇంజనీరింగ్ భవనం మొదటి అంతస్తులోని తరగతి గదిలో కాల్పులు జరిగాయి. ఫైనల్ పరీక్షలకు వెళ్లే తరగతి గదులకు బ్యాడ్జ్ యాక్సెస్ తప్పని సరి. ఆ దుండగుడు ఎలా భవనంలో ప్రవేశించాడో తెలియలేదని ప్రావిడెన్స్ మేయర్ తెలిపారు.అమెరికా లోని రోడ్ ఐలాండ్ లో అత్యంత కఠినమైన తుపాకీ చట్టాలు అమలులో ఉన్నాయి.గత వేసవిలో చట్టసభ అస్సాల్ట్ వెపన్ నిషేధ చట్టాన్ని ఆమోదించింది. వచ్చే జూలై నుంచి ఈ చట్టం అమలులోకి వస్తుంది. అప్పటి నుంచి అస్సాల్ట్ తుపాకుల తయారీ, అమ్మకాల నిషేధం అమలులోకి వస్తుంది. అయితే, ఇప్పటికే అమ్ముడైన ఆయుధాల స్వాధీనానికి వర్తించదు.