న్యూయార్క్/వాషింగ్టన్: కొత్తగా హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ “చట్ట విరుద్ధ ” నిర్ణయం ట్రంప్ ప్రభుత్వం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ 19 రాష్ట్రాలు మసాచుస్సెట్స్ జిల్లా లోని జిల్లా కోర్టులో దావా వేశాయి. ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఫీజును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని సవాలు చేస్తూ న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటీటియా జేమ్స్‌తోపాటు మరో 18 ఇతర అటార్నీ జనరల్స్ శుక్రవారం దావా వేశారు.
వైద్య, విద్య, ఇతర సాంకేతిక రంగాల్లో అత్యవసర సేవలు అందిస్తున్న హెచ్1 బి సిబ్బందిపై ఈ భారం పడుతుందని ఫలితంగా ప్రభుత్వానికి, లాభాలతో సంబంధం లేని సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతాయని వీరు పేర్కొన్నారు. హెచ్1 బి వీసాలు నైపుణ్యం కలిగిన డాక్టర్లు, నర్సులు, టీచర్లు , ఇతర కార్మికులు అమెరికాలో అత్యవసర సేవలు చేయడానికి వీలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు వీసా ఫీజు లక్ష డాలర్లకు అమాంతంగా పెంచడంతో ఈ కార్యక్రమం కష్టతరమౌతుంది. పిల్లల విద్య దెబ్బతింటుంది.ఆర్థికంగా నష్టం కలుగుతుందని జేమ్స్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.