స్పీకర్, కేంద్ర మంత్రిగా విశేషానుభవం
ఏడుసార్లు ఎంపి అయిన మరాఠా నేత
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో కీలకం
లాతూరు ః కాంగ్రెస్ దిగ్గజ నేత శివరాజ్ పాటిల్ శుక్రవారం మృతి చెందారు. 90 సంవత్సరాల పాటిల్ లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. మహారాష్ట్రలోని లాతూరులో ఆయన స్వగృహం దేవ్‌ఘర్‌లో ఉదయం ఆయన కన్నుమూసినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. స్వల్ప అస్వస్థత తరువాత ఆయన తనువు చాలించారు. శనివారం (నేడు) అంత్యక్రియలు స్థానికంగానే జరుగుతాయని సన్నిహితులు తెలిపారు. సౌమ్యుడుగా పేరొందిన శివరాజ్ పాటిల్ ముంబై 26/11 ఉగ్రదాడుల దశలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ దశలో ఆయన నిర్లక్షం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు కుమారుడు శైలేష్ పాటిల్, కోడలు అర్చన, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అర్చన బిజెపి టికెట్‌పై పోటీ చేశారు. కాంగ్రెస్ నేత అమిత్ దేశ్‌ముఖ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
శివరాజ్ పాటిల్ జీవితాంతం కాంగ్రెస్‌లోనే కొనసాగారు. నెహ్రూ గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడుగా నిలిచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పలు కీలక మంత్రిత్వశాఖలను నిర్వహించారు. ఆయన ప్రజా జీవితం ఐదు దశాబ్దాల పాటు సాగింది. ముంబై ఉగ్రదాడుల దశలో 2008 సంవత్సరంలో ఆయన నవంబర్ 26 నాడు రాత్రి మూడు సార్లు దుస్తులు మార్చి కనబడటం వివాదాస్పదం అయింది. ఓవైపు భయానక ఉగ్రదాడులు జరిగితే హోం మంత్రికి తన వస్త్రధారణే ముఖ్యమైందా? అనే విమర్శలు తలెత్తాయి. అయితే ప్రతిపక్షాలు పాలసీ ఆధారంగా విమర్శలకు దిగాలి తప్పితే , దుస్తులను బట్టి కాదని ఆయన సమర్థించుకున్నారు. కానీ తరువాతి పరిణామాలలో ఈ వ్యవహారం రాద్ధాంతానికి దారితీసింది. రెండు మూడు రోజుల్లోనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పాటిల్ మృతి పట్ల ప్రముఖులు అనేకులు సంతాపం వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని నరేంద్ర మోడీ, మహారాష్ట్ర సిఎం ఫడ్నవిస్, ఎన్‌సిపి నేత, పాటిల్ సమకాలీనులు శరద్ పవార్ , మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇతర నేతలు పాటిల్‌కు నివాళలు తెలిపారు. 1935 అక్టోబర్ 12న జన్మించిన శివరాజ్ రాజకీయ యాత్ర లాతూరు మున్సిపాల్టీ ఛైర్మన్‌గా 1966లో ఆరంభం అయింది. తరువాత రెండుసార్లు అక్కడి నుంచే ఎమ్మెల్యే అయ్యారు. లాతూరు లోక్‌సభ స్థానం ఆయనకు పెట్టని కోట అయింది. ఏకంగా ఏడుసార్లు గెలిచారు. 1991 నుంచి 96 వరకూ లోక్‌సభ స్పీకర్‌గా అందరి మన్నన్నలు పొందారు. కేంద్రంలో ఆయన రక్షణ, హోం, వాణిజ్య, శాస్త్ర సాంకేతిక వంటి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పంజాబ్ గవర్నర్‌గా కూడా వ్యవహరించారు. ఈ ఏడాది మార్చిలోనే పాటిల్ సకుటుంబంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడిని కలుసుకున్నారు. ఇది లాంఛనప్రాయపు భేటీ అని చెప్పారు. అయితే కాంగ్రెస్‌లో దీనిపై అనేక విమర్శలు తలెత్తాయి. బహుభాషాకోవిదుడు అయిన పాటిల్ మరాఠా నేతలు ఎందరికో మార్గదర్శి, గురువు, రాజకీయ సలహాదారుడు అయ్యారు.