హైదరాబాద్: శుక్రవారం బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకులంలో పలువురు విద్యార్థులు అస్వస్థత గురయ్యారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో 116 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని, ఇంత మంది విద్యార్థులు చనిపోయినా సిఎం రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను హరీశ్ రావు పరామర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ పై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది విమర్శించారు. ఒక్కరు కూడా ఆ పిల్లలను పరామర్శించలేదని, అందరూ ఫుట్ బాల్ ఆడడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్ బాల్ ఆడడానికి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నాడని, రూ.100 కోట్లతో ఫుట్ బాల్ ఆడేకంటే పిల్లలకు ఏదైనా మంచి హాస్టల్ కట్టి, కడుపు నిండా మంచి ఆహారం పెట్టొచ్చు కదా అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి విజన్ 2047 అంటున్నారు..కానీ ఇది పాయిజన్ 2047 తెలంగాణ వ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక మూలలో కలుషిత ఆహారంతో పిల్లలు మంచాలపై పడుతున్నారని, అస్వస్థతకు గురైన పిల్లలు తిరిగి గురుకులాలకు వెళ్లాలంటే భయపడుతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.