కోల్‌కతా: అర్జెంటీనా దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ మైదానంలో పర్యటించారు. కానీ, అక్కడ మెస్సీకి నిర్వాహణ లోపం తలెత్తడంతో ఆయన కేవలం పది నిమిషాలు మాత్రమే ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన అభిమానులు స్టేడియంలోని కుర్చీలు, టెంట్లు ధ్వంసం చేశారు. ఈ గందరగోళ పరిస్థితులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే మెస్సీకి, అభిమానులకు క్షమాపణ చెప్పి.. విచారణకు ఆదేశించారు. తాజాగా పోలీసులు ఈవెంట్ మేనేజర్ శతద్రు దత్తాని అరెస్ట్ చేశారు. ‘శతద్రు దత్తా ఇనిషియేటివ్’ కింద మెస్సీ ఈవెంట్ టికెట్లను అతడు విక్రయించాడని పేర్కొన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయని.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రధాన నిర్వహకుడిని అరెస్ట్ చేశామని.. టికెట్ డబ్బులు తిరిగి ఇస్తామని నిర్వహకులు చెబుతున్నారని. అది ఎలా చేస్తారో పరిశీలిస్తామని పేర్కొన్నారు.