నిరంతరం ప్రజల మధ్య ఉండి వారి కష్టసుఖాలు తెలుసుకొని తమ శక్తి మేరకు వారి అవసరాలు తీర్చి, ప్రజాదరణ పొంది అధికారంలోకి రావాలని రాజకీయ పార్టీలు అహర్నిశలు పాటుపడుతూ ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు రోజులు మారాయి. రాజకీయ పార్టీల పనితీరులో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ‘నువ్వు ప్రజల్లో ఉండడం లేదట’ అని కార్యకర్తలని, కిందిస్థాయి నాయకులను నిలదీసేవారు పెద్ద నాయకులు. ఇప్పుడు ‘నువ్వు సోషల్ మీడియాలో చురుగ్గా లేవట’ అని కోప్పడే స్థితి వచ్చింది. నిజమే, టెక్నాలజీ ఇంత అభివృద్ధి సాధించినప్పుడు నాయకులు నేరుగా వెళ్లి ప్రజలను కలవాల్సిన అవసరం ఏమిటి? సోషల్ మీడియా ద్వారా తాము చెప్పదలచుకున్నది చెప్పొచ్చు, ప్రజల నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవచ్చు అని రాజకీయ పార్టీల అగ్రనాయకులు అనుకుంటున్నారు. దీనికి తాజా ఉదాహరణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తన పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలతో అన్నమాటలు. ‘మీరు సోషల్ మీడియాలో చురుకుగా ఉండటం లేదు, మీకంటే అసదుద్దీన్ ఒవైసి చాలా మేలు. సమర్ధవంతంగా తన సోషల్ మీడియా నడుపుతున్నాడు’ అని వ్యాఖ్యానించారట ప్రధానమంత్రి. సోషల్ మీడియాలో వెనకబడితే ప్రజల మెప్పు పొందటంలో కూడా వెనుకబడిపోతారన్నమాట. ఇదీ ప్రస్తుత రాజకీయాల పరిస్థితి.
తెలంగాణలో బిజెపి పరిస్థితి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా గత గురువారం ఉదయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన పార్టీ పార్లమెంట్ సభ్యులతో మోడీ బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన తెలంగాణ ఎంపీలకు తలంటినట్టు సమాచారం. ప్రధానమంత్రికి- పార్లమెంట్ సభ్యులకు మధ్య ఆ బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో జరిగింది ఏమిటి అన్న విషయం అధికారికంగా ఎవరికి తెలియకపోయినా రెండు రాష్ట్రాల ప్రాంతీయ మీడియా అంతటా దాదాపుగా ఒకే రకమైన సమాచారం వార్తగా వచ్చింది. ఇందులో కొత్తగాని, వింతగానీ ఏమీ లేదు. ఆ సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు లేదా ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు మీడియాకి సమాచారాన్ని అందించి ఉండవచ్చు. అయితే మీడియాకు ఈ సమాచారం ఎవరు అందించి ఉంటే వారు తమకు అనుకూలంగా ఉండే సమాచారాన్ని మాత్రమే బయటపెడతారు సహజంగా. సరిగా పని చెయ్యడం లేదు, ముఠాలు కడుతున్నారు అని తమను ప్రధాని తిట్టినట్టు తెలంగాణ ఎంపీలు, కేంద్ర మంత్రులు చెప్పుకోరు కాబట్టి ఇది పొరుగు రాష్ట్ర ఎంపీలో, ప్రధాన మంత్రి కార్యాలయంలో లీక్ చేసినదయి ఉండొచ్చు.
ఇక ఆ భేటీలో ప్రధానమంత్రి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బిజెపి పరిస్థితి మీద వెలిబుచ్చిన అభిప్రాయాన్ని గురించి మాట్లాడుకోవాలి. పార్టీ నేతలు సరిగ్గా పనిచేయడం లేదని, ముఠా తగాదాలు పెరిగిపోయాయని ప్రధానమంత్రి తెలంగాణ ఎంపీల మీద ఆగ్రహం ప్రదర్శించారు. వేర్వేరు రాజకీయాలనుండి వచ్చిన వాళ్లంతా ఒక దగ్గర చేరినప్పుడు ముఠాలు ఏర్పడకుండా ఎలా ఉంటాయి? ఆ ముఠాల మధ్య తగాదా లేకుండా ఎలా ఉంటుంది? ఆ విషయం ప్రధానమంత్రికి బాగా తెలుసు. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కొన్ని పార్టీల కదంబం. భారత రాష్ట్ర సమితి నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన నాయకులు కూడా ఉన్నారు. వారిలో ప్రజాదరణ కలిగిన వాళ్లు కూడా ఉన్నారు. అటువంటప్పుడు సహజంగానే అంతర్గత కలహాలు ఏ రాజకీయ పార్టీకైనా తప్పని బెడదే. తెలంగాణ బిజెపిలో కూడా అదే జరుగుతున్నది. అక్కడ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో ప్రధానమంత్రి తెలంగాణ ఎంపీలకు క్లాస్ తీసుకుంటున్న సమయంలోనే ఇక్కడ తెలంగాణలో ఇద్దరు ఎంపీలకు సంబంధించిన అంతఃకలహం సోషల్ మీడియాలో జోరు అందుకున్నది. సోషల్ మీడియాలో మీరు వెనుకబడి ఉన్నారు,
మీకంటే ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చాలా నయం, చాలా సమర్థంగా ఆయన సోషల్ మీడియా నిర్వహిస్తున్నారని ప్రధానమంత్రి ఈ బ్రేక్ ఫాస్ట్ సమావేశంలో అన్నట్టు వార్తలు వచ్చాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకోవడంలో, అంతఃకలహాల్ని బహిరంగం చేసుకోవడంలో తెలంగాణ బిజెపి నాయకులు సోషల్ మీడియాలో వెనుకబడి లేరు. ‘నాకు అన్నీ తెలుసు’ అని ఒక ఎంపీ నోరు మూయించిన ప్రధానమంత్రికి ఈ విషయం తెలిసినట్టు లేదు. మొన్న ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒక ఎంపీ పార్టీ వారిని కాదని తన అనుయాయులను నిలబెట్టి ఓటమి పాలు చేసుకున్నారని బిజెపికి చెందిన కేంద్ర మంత్రి సహాయకుడు ఒకరు సోషల్ మీడియాలో పెట్టిన విషయం ప్రస్తుతం ప్రచారంలో ఉన్నది.
తెలంగాణలో బిజెపి నాయకులు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదన్నది ప్రధానమంత్రి ఆవేదన. తెలంగాణలో రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీల పరిస్థితి అదే విధంగా తయారవుతున్నది. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి రెండిటి ప్రస్తుత పరిస్థితి చూస్తే కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్టే కనిపిస్తున్నది. భారతీయ జనతా పార్టీలో నెలకొన్న అంతఃకలహాలు, భారత రాష్ట్ర సమితిలో రోజురోజుకీ బయట పడుతున్న కుటుంబ తగాదాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే చెబుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి రెండవ టర్మ్ ఖాయం చేసినట్టే కనిపిస్తున్నది. ‘మోడీజీ తెలంగాణ మే ఆప్కా కిచిడి పక్ రా నహీ షాయద్’.
ఇక తెలంగాణతోపాటు ప్రధానమంత్రి బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్న మిగతా రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ విషయానికొస్తే అండమాన్ గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదు పెద్దగా. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ఐలాండ్ లో ఒకే ఒక్క లోక్‌సభ స్థానం ఉంది. ఆ ఒక్క స్థానం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచారు. శాసనసభ లేదు కాబట్టి రాజ్యసభ సభ్యులు ఉండే అవకాశం లేదు. ఇక తెలంగాణతో పోలిస్తే సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌ను పెద్ద రాష్ట్రంగా భావించాలి. 25మంది లోకసభ సభ్యులు, 11మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే కూటమిలో భాగంగా ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్రంలో ముగ్గురు లోకసభ సభ్యులు, నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అలా చూసినట్లయితే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణలోనే బిజెపికి బలం ఎక్కువ పార్లమెంట్లో. సరే తను భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రం కాబట్టి ప్రధానమంత్రి ఆ రాష్ట్రం గురించి నాలుగు మంచి మాటలు చెప్పినట్టు ఉన్నారు. అందులో ఏపీలో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయడం మంచి పరిణామం అని ఆయన పేర్కొన్నట్టు, రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి మీద కూడా తనకు మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయని అన్నట్టు మీడియా ప్రచురించింది. ముందే చెప్పుకున్నట్టు అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామి పార్టీ కాబట్టి ఆ మాత్రం శభాష్ అని వెన్ను చరుచుకోవడంలో తప్పులేదు. అయితే ‘మేరెకో సబ్ కుఛ్ మాలూమ్’ (నాకంతా తెలుసు) అని తెలంగాణ ఎంపీలను గదమాయించిన ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ లో సబ్ కుఛ్ మాలూమ్ కరేతో (అంతా తెలుసుకుంటే) బాగుండేది. ఆంధ్రప్రదేశ్ లో గతంలో కంటే బిజెపి బలపడుతుందని, ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని కేంద్రమంత్రి భూపతిరాజు చెప్పిన మాటలు విని శభాష్ అనకుండా అక్కడి వాస్తవ పరిస్థితిని కూడా ప్రధానమంత్రి తెలుసుకుంటే బాగుండేది.
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి బలపడుతున్న మాట ఎలా ఉన్నా, బిజెపి అగ్రనాయకత్వాన్ని సంతుష్టులను చేసుకోవడానికి, అమితానందపరచడానికి కూటమిలోని రెండు మిగతా పక్షాలు పడరాని పాట్లు పడుతున్న మాట మాత్రం వాస్తవం. కూటమి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, కూటమిలోని మరో భాగస్వామ్య పార్టీ జనసేనకు చెందిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తడానికి దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. వేషధారణ కూడా కాషాయానికి మార్చేసి కొద్ది రోజులు ‘ఐయామ్ ఏ అన్ అపాలజిటికల్ సనాతన హిందూ’ అని బహిరంగ ప్రదర్శనలు చేసిన పవన్ కళ్యాణ్ ఈ మధ్య జోరు తగ్గిస్తే ఆ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, నటుడు, ముఖ్యమంత్రి బావమరిది అయినా నందమూరి బాలకృష్ణ బయలుదేరాడు. మూడు రోజుల క్రితం ఆయన నటించిన ఒక సీక్వెల్ ‘అఖండ 2’ విడుదలైంది. అందులో ఆయన చేసిన తాండవం చూస్తే బిజెపిని, ఆ పార్టీకి మార్గనిర్దేశం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ను సంతుష్టిపరచడానికి ఎంత శ్రమ పడ్డాడో అర్థం అవుతుంది. అన్నట్టు ఈ సినిమా విడుదలకు ముందే ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మహేష్ భగవత్ ఢిల్లీలోనే ఒక ప్రత్యేక ప్రదర్శన వేయించుకొని చూసి గొప్పగా ఉందని మెచ్చుకున్నారట.
ఈ సినిమాలో మిగతా అసహజ విన్యాసాలనట్లా వదిలేస్తే సర్వమతాలకు నిలయమైన భారతదేశాన్ని కాషాయం కట్టుకున్న దేశం చేసేసాడు. ఒంటిచేత్తో సనాతన హిందూధర్మాన్ని మూడు గంటల్లో కాపాడేసాడు. ఇది కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమికి నాయకత్వం వహిస్తున్న బిజెపి పెద్దలను మరింత మచ్చిక చేసుకోడానికే అని సినిమా చూసిన వాళ్లందరికీ అర్థం అవుతుంది. ఇది కేవలం రచయిత, దర్శకుడూ అయిన బోయపాటి బుర్రలో పుట్టిందా అన్నది అనుమానమే. సినిమాలో ఇంత అసహజత్వాన్ని చూసి పెద్దాయన మహేష్ భగవత్ కూడా మొహం పక్కకు తిప్పుకుని నవ్వేసి ఉంటారు. కూటమిలోని బిజెపియేతర పక్షాలు రెండూ పోటీపడి ఇలా హిందుత్వ ప్రచారానికి దిగితే ఆంధ్రప్రదేశ్ లో అసలు బిజెపి ఎదుగుదలకే ఎసరు అవుతుందేమో.
కొసమెరుపు కూడా ఉండాలి కదా. రేపోమాపో ఆంధ్రప్రదేశ్ లో యువరాజుకు పట్టాభిషేకం తప్పదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఢిల్లీ పర్యటనలను తగ్గించుకొని ఎక్కువ కొడుకు లోకేష్‌నే పంపిస్తున్నారని చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. 15 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలో ఉంటుందని, ఆ కూటమికి చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రి అని పదేపదే ప్రకటిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ పరిణామాన్ని ఎలా తీసుకుంటాడో కానీ తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా లోకేష్ ను బలంగా సమర్థిస్తున్న ఒక వర్గం మీడియా ఉబ్బితబ్బిబ్బై పోతున్నది. అందులో భాగంగానే ఆ మీడియాకి లోకేశ్ ను పల్లెత్తు మాట ఎవరు అన్నా భోజనం సహించడం లేదు.
ఇటీవల భారత విమానయానంలో ఒక అవాంతరం ఏర్పడింది. దానిమీద బాధ్యులు ఎవరనే చర్చ జాతీయ మీడియాలో జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీలోని లోకేశ్ భక్తుడు ఒకాయన ఈ సంక్షోభం మీద వార్‌రూమ్ ఏర్పాటు చేసి తమ నాయకుడు పర్యవేక్షిస్తున్నాడని చెప్పడంతో రిపబ్లిక్ టివి ముఖ్య సంపాదకుడు అర్నాబ్ గోస్వామి ‘కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉండగా రాష్ట్ర మంత్రి లోకేశ్‌కు ఏం సంబంధం?’ అని నిలదీయడంతో పాపం లోకేశ్ అనుకూల మీడియా తీవ్ర ఆవేదనకు గురైంది. మరునాడు అర్జెంటుగా తమ సాయంకాలపు చర్చాగోష్టుల్లో లోకేశ్ అర్హతలను ప్రశ్నించిన అర్నాబ్ గోస్వామిని ఓ ఆటాడేసుకున్నారు. అంతేకాదు, ఒక న్యూస్ ఛానల్ పెద్దాయన అయితే ఈ విషయంలో లోకేశ్‌ను సమర్థించే విధంగా స్పందించనందుకు చంద్రబాబునాయుడు మీద కూడా అలిగాడు. ఈ మీడియా సంస్థల అతి ఎటుపోయి ఏమవుతుందో చూడాలి.
