రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మూడో విడత ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఉన్న అంచనాలు పంచాయతీ ఎన్నికల సందర్భంగా స్పష్టం కావడంతో ఇదే సమయంలో పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు బాగుంటాయని అంచనా వేస్తోంది. దీంతో ఈ నెలలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ జారీ చేసే దిశగా అధికార యంత్రాంగం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా అందిన మౌఖిక ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి కాగానే ఎన్నికల సంఘానికి సమాచారం అందించేందుకు అధికారులు పని చేస్తున్నారు.పంచాయతీ ఎన్నికలు తొలి విడత ఇప్పటికే పూర్తి కాగా, రెండో విడత ఈ నెల 14 ఆదివారం,
మూడో విడ త 17న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. దీంతో ఈ నెల 20 నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఇక జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేసుకుంటూ పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సర్వం సిద్ధమైతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 23, 27 తేదీల్లో విడుదల చేసేలా ఎన్నికల సంఘానికి తెలియజేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సిద్ధం చేసిన ఓటర్ల జాబితా, మండల, జడ్పీటిసిల లెక్కలు ప్రభుత్వం వద్ద ఉండడంతో ఇక ఎన్నికలకు వెళ్లడమే తరువాయి అని చెబుతున్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం చేసింది. రాష్ట్రంలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయా వర్గాల సమాచారం.