అమరావతి: గ్రామసభలు నిర్వహించి రైతులతో మాట్లాడుతున్నామని ఎపి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. సిఆర్ డిఎ కార్యకలాపాలపై కేంద్రమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరీబు భూముల సమస్యలపై నెల రోజుల సమయం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, నేల స్వభావంపై పరీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఉండవల్లి లేఔట్ అభివృద్ధి ప్రారంభమైందని, లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందని అన్నారు. 7 వేల ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉందని, భూసమీకరణ చేయని భూముల్లో ప్లాట్లు పొందిన వారి సమస్య పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. అక్కడ రైతులతో ఎమ్మెల్యే, మంత్రి మాట్లాడాక భూసేకరణకు వెళ్తామని, వేరే చోట ప్లాట్లు కావాలని అడిగిన వారికి లాటరీ ద్వారా కేటాయించే చర్యలు తీసుకుంటామని అన్నారు.
పెద్ద ప్లాట్లు పొందేవారు కొంత సమయం వేచి ఉండాలని, కమర్షియల్ ప్లాట్లలో వాస్తు ప్రకారం ఉండాలని కొందరు అడిగారని అన్నారు. 7 ఎకరాల మేర ప్లాట్లు మార్చాల్సి ఉంటుందని, రైతులు మళ్లీ వాస్తు పేరిట రావొద్దని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. 18 వేలమంది రైతులు, రైతు కూలీలకు హెల్త్ కార్డులు, 26 గ్రామాల్లో అభివృద్ధి పనుల డిపిఆర్ లు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వారంలో డిపిఆర్ లు సిద్ధంచేసి నెలాఖరులోగా పనులు ప్రారంభం చేస్తామని, సామాజిక అభివృద్ధిలో భాగంగా కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాల నిర్మాణాలకు భూమి, నిధులు సమకూరుస్తామని అన్నారు. రాజధాని గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్య పెంచుతామని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.