న్యూఢిల్లీ ః మెక్సికో భారీ సుంకాల పట్ల భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రయోజనాలు పరిరక్షణ కోణంలో తాము తగు విధంగా ప్రతిచర్యకు దిగాల్సి ఉంటుందని భారత ప్రభుత్వం మెక్సికోను శనివారం హెచ్చరించింది. ట్రంప్ ఆదేశాలకు లోబడి భారత్‌కు చెందిన నిర్ణీత సరుకులపై మెక్సికో 50 శాతం సుంకాల పెంపుదలకు దిగింది. ఈ చర్యను భారత్ తీవ్రస్థాయి నిర్ణయంగా పరిగణించింది. దేశీయ ఉత్పత్తులు, ఎగుమతిదారుల ప్రయోజనాలు కీలకం. వీటి కోసం తగు విధంగా స్పందించే హక్కు తమకు ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఓ వైపు మెక్సికోతో నిర్మాణాత్మక సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుంది. మరో వైపు చర్యకు ప్రతిచర్య విధానం ఉండనే ఉంటుందని స్పష్టం చేశారు. మెక్సికో ప్రభుత్వం సుంకాల పెంపుదల బిల్లును తీసుకువచ్చే దశలోనే భారత్ తన వైఖరిని తెలిపింది. హెచ్చింపు ప్రతిపాదనలను వ్యతిరేకించింది.
అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల పరిధిలోనే పరస్పర పరిష్కారం, సామరస్యం దిశలో ఉండేలా వ్యవహరించాలని అక్కడి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖకు భారతదేశ వాణిజ్య విభాగం హితవు పలికింది. అయితే వీటిని పక్కకు పెట్టి మెక్సికో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏకపక్షంగా ఎంఎఫ్‌ఎన్ టారీఫ్‌లను పెంచింది. ముందస్తు సంప్రదింపులు లేకుండానే వ్యవహరించింది. మన సహకార ఆర్థిక కార్యకలాపాల పద్థతికి విరుద్ధంగా చర్యకు దిగింది. అయితే దీనిపై చూస్తూ ఉండటం కుదరదు. మేం తీసుకునే చర్యల హక్కు మాకు ఉంటుంది. దీనిని మెక్సికో గుర్తించాల్సి ఉంటుందని తెలిపారు. బహుళ స్థాయి వ్యాపార వ్యవస్థకు భంగకరమైన రీతిలో చర్యకు దిగితే , అందుకు ప్రతిగా తమ స్పందన ఉండనే ఉంటుందని ఘాటుగా స్పందించారు.