పార్లమెంట్ అన్నది ప్రజాసమస్యలపై విస్తృతంగా చర్చించవలసిన వేదిక. అంతేకాదు ఆ మేరకు పాలనా విధానాలపై మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యతాపరమైన చక్కని అవకాశం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి జాతీయ గేయం వందేమాతరం, ఎన్నికల సంస్కరణలు అనే రెండు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తున్నాయి. వాడిగా, వేడిగా సాగిన ఈ చర్చలు ఎంతవరకు నిజంగా ఫలప్రదమవుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. ఉదాహరణకు జాతీయ గేయం వందేమాతరంపై చర్చలో కొంతవరకు చారిత్రక, చట్టబద్ధమైన ప్రస్తావనలు తెరపైకి తీసుకువచ్చి తమ వాదన వినిపించడంలో విపక్షం విజయం సాధించిందనే చెప్పవచ్చు. కానీ పాలక పక్షం అడ్డగోలు వాదనలతో పూర్వ జాతీయ కాంగ్రెస్ నాయకులపై బద్ధ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోంది. వారికి నెహ్రూ ఫోబియా వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఎన్నికల సంస్కరణలపై చర్చ విషయానికి వస్తే ఇదివరకటి ఆరోపణల డ్రామాగానే దారితీసింది. ప్రజాతీర్పును హైజాక్ చేయడానికి ఎన్నికల కమిషన్ స్వతంత్రతను ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం బలహీనపర్చి దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈ విమర్శలను పాలక వర్గం కొట్టి పారేస్తూ అక్రమ చొరబాటుదార్లను, అనర్హులైన ఓటర్లను ఏరివేయడానికే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) దేశమంతా నిర్వహిస్తున్నట్టు సమాధానం ఇచ్చింది.
అక్రమ వలసదారులను ఓటర్ల జాబితాల్లోంచి తొలగిస్తే ఎన్నికల్లో తమకు నష్టం వస్తుందన్న భయంతో విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ చట్టబద్ధమైన ప్రక్రియకు లేనిపోని అభ్యంతరాలు తెలుపుతోందని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై సందేహాలు వ్యక్తం చేస్తుంటారని, గెలిచినప్పుడు ఈ ప్రస్తావనే తీసుకురాకపోవడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని చాటుతుందని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించలేకపోయింది. ఏదెలాగున్నా అక్రమ వలసదారులను భారత ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి బయటకు పంపడమే ఎస్‌ఐఆర్ లక్షమని అమిత్ షా వాదించారు. ఎన్‌డిఎ ప్రభుత్వం అక్రమ వలసదారుల విషయంలో తన నిఘా (డిటెక్ట్), తొలగింపు (డిలీట్), బహిష్కరణ (డిపోర్టు) విధానాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగ పరమైన వివాదానికి దారితీస్తోంది. వాస్తవానికి ఓటర్ల జాబితాను క్రమబద్ధీకరించడమే ఎస్‌ఐఆర్ విధి. చనిపోయిన ఓటర్లను జాబితానుంచి తొలగించడం, డూప్లికేట్ ఐడికార్డులను తొలగించడం, వలసదారులైన ఓటర్ల సమస్యను పరిష్కరించడం మాత్రమే చేయాలని ఎస్‌ఐర్‌పై పిటిషన్ల విచారణలో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతేతప్ప ఓటరు పౌరసత్వం నిర్ణయించే హక్కు ఎన్నికల కమిషన్‌కు లేదు. కానీ అమిత్ షా ఓటరు జాబితాలో ఎవరి పేర్లు ఉండవో వారు బహిష్కృతులవుతారని తన సహజ ధోరిణిలో చెప్పడం వివాదాస్పదమవుతోంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ప్రక్రియను ఎస్‌ఐఆర్‌లో చొప్పించడమేమిటని విపక్షాలు నిలదీస్తున్నాయి. అంతేకాదు ఎస్‌ఐఆర్ పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి. ఇక చీఫ్ ఎలెక్షన్ కమిషనర్‌ను ఎంపిక చేసే ప్యానెల్ నుంచి చీఫ్ జస్టిస్‌ను ఎందుకు తొలగించారన్న ప్రశ్న విపక్షాల నుంచి రాగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎవరినీ సంప్రదించకుండా ఈ ఎంపిక ప్రత్యేకంగా జరిగిందని అమిత్ షా ఉదాహరణ చూపించారు. ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రి, విపక్ష నాయకుడుతో ఉన్న ప్రస్తుత ప్యానెల్ ఎంపికలో తేడా ఏమొచ్చిందని కూడా ప్రశ్నించారు. కొత్త చట్టంలో సిఇసి, ఇసిల మధ్య సమానత్వాన్ని తీసివేసి, ఇసిలను తొలగించే అధికారం సిఇసికి ఎలా కల్పించారు? అన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. ఇలా చేయడం నిజంగా ఎన్నికల నిర్వహణ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీయడమే అవుతుంది.
విపక్ష నాయకుడు ఓటు చోరీ జరిగిందని అంటూ కొన్ని అవకతవకలు బయటపెట్టారు. వీటికి ఎన్నికల కమిషన్ కానీ, పార్లమెంట్ చర్చల్లో ప్రభుత్వం కానీ వివరణ ఇవ్వకుండా మొఖం చాటేయడమే జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై అధికార పక్షం వేలెత్తి చూపించినప్పుడు సరైన నిర్మాణాత్మక వాస్తవాలు కనిపించాలి తప్ప ‘గతంలో మీరేం చేశారు?’ అని ఎదురు ప్రశ్న సరైన విధానం కాదు. అలాగే అధికార, ప్రతిపక్షవర్గాలు ఇంతవరకు ఉభయత్రా జరిగిన పొరపాట్లను గుర్తించి అవి మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకునే మార్గాలేమిటో అన్వేషించాలి. ఎన్నికల నిర్వహణ యంత్రాంగాన్ని జవాబుదారీగా, పారదర్శకంగా బలోపేతం చేయాలి. కానీ ఈ విషయంలో పాలకవర్గాలకు సరైన శ్రద్ధ ఉన్నట్టు తోచడం లేదు. విపక్షాల వాదనలను చిత్తు చేయడానికే పార్లమెంట్ సమావేశాలను వినియోగించుకుంటున్నారు. ద్వేష ప్రసంగాలతో కత్తులు దూసుకుంటున్నారు. స్వాతంత్య్ర పోరా టం కులమత వర్గాలకు అతీతంగా సమైక్య స్ఫూర్తితో ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. బ్రిటిష్ ప్రభుత్వ విభజించు పాలించు పన్నాగాలను చీల్చిచెండాడేలా కులమతవర్గాలకు అతీతంగా సమైక్య స్ఫూరితో స్వాతంత్య్ర పోరాటం ఎలా సాగిందో ఎవరికీ తెలియనిది కాదు. కానీ నేడు చారిత్రక వాస్తవాలను పక్కదారి పట్టించి విభజించు పాలించు విధానంతోనే ఓట్ల బ్యాంకు కొల్లగొట్టడానికి బూటకపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తుండడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తీరని కళంకం. పార్లమెంట్ కార్యకలాపాలకు నిమిషానికి రూ. 2.5 లక్షల వరకు ఖర్చవుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కానీ మన ప్రజా ప్రతినిధులు వ్యర్థ ప్రసంగాలతోనే కాలం గడిపితే ఎంత దుర్వినియోగం అవుతుందో ఆత్మపరీక్ష చేసుకోవడం మంచిది.