వందేమాతరం ఒక పదం. అది ఒక అక్షర సముదాయం మాత్రమే కాదు. అది ఒక నాటి తరాన్ని నిరంతరం నిద్రలేపి ఉద్యమాలలోకి ఉరికించిన అక్షర నినాదం. భారత స్వాతంత్య్ర సమరంలో వందేమాతరం అనే అక్షరాలు కోట్లాది భారతీయులను ఉత్తేజపరిచిన ఆయుధాలు. ఆ అక్షరాల అంకురార్పణకు సరిగ్గా 150 ఏళ్లు నిండాయి. ఇది భాతీయులందరికీ ఒక అద్భుతమైన సందర్భం. అప్పటి ఉద్యమాల జ్ఞాపకాలను నెమరువేసుకొని భవిష్యత్ తరాలకు దాని స్ఫూర్తిని అందించే కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి.
అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లో వందేమాతరంపై చర్చసాగింది. సందర్భం సరైనదే కాని పార్లమెంటుకు ప్రత్యేకించి లోక్‌సభ నాయకుడుగా భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఉద్దేశం మాత్రం దారితప్పింది. వందేమాతరం సంపూర్ణ సారాంశాన్ని కాకుండా కొందరి ప్రయోజనాలకోసం అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంక్తులను కుదించారని, ఇది దేశ ద్రోహమని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలను గుప్పించారు. ఇది ప్రతి విమర్శలకు, చర్చోపచర్చలకు దారితీసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సభ్యులు ఎదురు దాడి చేశారు. భారత స్వాతంత్య్ర సమరానికి నాయకత్వం వహించింది, వందేమాతరం గీతాన్ని సమర నినాదంగా మార్చింది కాంగ్రెస్ మాత్రమేనని జవాబు విసిరారు. ఇప్పటి భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ భారతీయ జనసంఘ్, దాని పితృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేశారని, స్వాతంత్య్ర సమరంలో ఆ శక్తులు ఎప్పుడూ భాగస్వాములు కాలేదని, కాంగ్రెస్ బిజెపిపై ధ్వజమెత్తింది. అయితే ఈ చర్చ పార్లమెంటుకు మాత్రమే పరిమితం కాలేదు. బయటి కూడా దాని ప్రతిస్పందనలు వినవస్తున్నాయి. కొంత కాలం వేరే విషయాలమీద చర్చ ఉండదు. కేవలం ఈ విషయం మీదనే చర్చ సాగుతుంది. ఇది ఏదో యథాలాపంగా నరేంద్ర మోడీ లేవనెత్తలేదు. దీని వల్ల నరేంద్ర మోడీ కొన్ని ప్రయోజనాలను ఆశిస్తున్నారు.
ఇప్పటి తరంలో నెహ్రూను దేశద్రోహిగా నిలబెట్టాలనేది, దీని వల్ల కాంగ్రెస్‌ను కూడా దోషిగా చూపించాలనే ఉద్దేశం. రెండోది పార్లమెంటు జరుగుతున్న సందర్భంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించాలి. అవి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. అందువల్ల ఈ వివాదాన్ని ముందుకు తెస్తే, ఈ సమావేశాలు మొత్తం దీని మీదనే నడిపించొచ్చు. అవసరమైన బిల్లులను గుట్టుచప్పడు కాకుండా ఆమోదింప జేసుకోవచ్చు. ఇది పాలకవర్గాలలో ఉండే లక్షణం. దీనినే నరేంద్ర మోడీ తన ఎత్తుగడగా భావించారు. దీనిని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకొని వ్యవహరించాలి. వందేమాతరం మీద చర్చను పక్కనపెట్టి ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించాలి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు ప్రియాంకా గాంధీ సరిగ్గానే వ్యక్తపరిచారు. వందేమాతరం మీద చర్చను పక్క పెట్టి ప్రజల అత్యవసర సమస్యలైన అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం లాంటి సమస్యలపై చర్చించాలని సభలో ప్రస్తావించారు.
ఇక్కడే పౌరసమాజం కూడా స్పందించాలి. పార్లమెంటు సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు, దాని ప్రభుత్వ సమాధానాలు, పరిష్కారాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడాలి. అయితే గత కొంత కాలంగా ఏదో ఒక వివాదాన్ని లేవనెత్తడం, దాని గురించి చాలా తీవ్రంగా మాట్లాడుకోవడం, వాకౌట్‌లు, సస్పెండ్‌లు, సమావేశాలు ముగియడం. ఇది రివాజు. ప్రభుత్వం తన ధోరణిలో తాను పని చేసుకుంటూ వెళ్లడం జరుగుతుందే కాని నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన ఉండడంలేదు. ఇది చాలా శోచనీయం. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు.
ప్రస్తుతం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నట్లు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఇందులో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరూ దీనికి అతీతులు కాదు. ముఖ్యంగా కేంద్రం సంపూర్ణంగా ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను విస్మరించింది.
ముఖ్యంగా దేశంలోని నూటికి 80 శాతం మందికి పైగా ప్రజలు సామాజిక, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందులో అందరినీ పట్టిపీడించేది అధిక ధరలు. గత పదేళ్లలో ధరలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పడానికి వీలు లేదు. నేను పేర్కొంటున్న ధరలు జాతీయ స్థాయి గణాంకాల నుంచి తీసుకున్నవి. ఇందులో మన రాష్ట్రానికి కొద్దిగా అటుఇటుగా తేడాలు ఉండవచ్చు. కాని పెరుగుదల మాత్రం సత్యం. నిత్యావసర వస్తువులు అందులో ముఖ్యంగా ఆహార వస్తువుల ధరలను పరిశీలిస్తే ఎంత తీవ్రంగా పెరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు. 2014 సంవత్సరంలో కంది పప్పు 70 రూపాయలు ఉంటే 2025 వచ్చేసరికి 150 రూపాయలకు పెరిగింది. మినపపప్పు 64 నుంచి 123 రూపాయలు కూడా దాటింది. శెనగ పప్పు 47 రూపాయల నుంచి 88 రూపాయలు చేరుకున్నది. అట్లాగే ఉల్లిగడ్డ, టమాట, బంగాళా దుంపలు 50 శాతం నుంచి 60 శాతం వరకు పెరిగాయి. వంట నూనెల ధరలు 3 రెట్లు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయో ప్రత్యక్షంగా మనం రోజూ చూస్తూనే ఉన్నాం.
ఇది ప్రతి భారతీయుడిపై పడుతున్న భారం. అయితే ఇదే స్థాయిలో కార్మికుల, ఉద్యోగుల వేతనాలు పెరగలేదు. ఒక సాధారణ ఉద్యోగి ప్రైవేటు రంగంలో 2014 రూ. 20 వేలు జీతం పొందితే, నేడు ఆ ఉద్యోగి రూ. 30 వేలు మాత్రమే అందుకుంటున్నాడు. అంటే 50 శాతం మాత్రమే పెరుగుదల కనిపిస్తున్నది.ఇది ఉద్యోగ భద్రత కలిగిన కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇందులో 30 నుంచి 40 శాతం ఇంటి అద్దెలకే పోతాయి. ఇద్దరు పిల్లలుంటే ప్రతి నెల మరో 30 శాతం వాళ్ల చదువులకు చెల్లించాలి. మిగిలిన 40 శాతం డబ్బులో తన రోజువారీ ప్రయాణ ఖర్చులు, ఇంట్లో అవసరమైన వైద్యం, మందుల ఖర్చులు. ఇవన్నీ పోను ఇంటి నిత్యావసర వస్తువులను ఎట్లా కొనుగోలు చేస్తాడనేది పెద్ద ప్రశ్న. అందుకే నూటికి 60 నుంచి 70 శాతం మంది ప్రతి రోజు ఒక నరకంలో జీవిస్తున్నారు. డిగ్రీలు, పిజిలు చదివి ప్రైవేటు విద్యాలయాల్లో, కంపెనీల్లో పని చేస్తున్న వందలాది మంది ప్రతి నెల అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నారు. కొంత మంది రెగ్యులర్ ఉద్యోగంతో పాటు, ఇతర చిన్నచితక ఉపాధిని వెతుకుంటున్నారు. స్విగ్గి, జొమాటో లాంటి సర్వీసులలో కూడా చేస్తున్నారు. రాపిడో ద్వారా బైకులు నడుపుకుంటున్నారు.
ఇవి కదా పార్లమెంటులో చర్చిచాల్సింది. దానికి కదా తమ సమయాన్ని వెచ్చించి పరిష్కారాలను ఆలోచించాల్సింది. దీనితో పాటు మరొక ముఖ్యమైన సమస్య నిరుద్యోగం. ఈ సమస్యకు పరిష్కారం చాలా అత్యవసరం. దేశంలోని కోట్లాది మంది నిరుద్యోగంతో సతమతమవుతున్నారు. మన హేతు విరుద్ధమైన చదువుల వల్ల ఇందులో చాలా మందికి వృత్తి నైపుణ్యం లేదు. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక, యాంత్రిక పెరుగుదల వల్ల మనిషి పని నుంచి వేరు పడిపోతున్నాడు. దానితో కొద్ది మంది మాత్రమే వృత్తిలోకి అడుగు పెట్టగలుగుతున్నారు. ఇందులో ఇప్పటికే భూములు, వ్యాపారాలు, ఇతర వనరులు ఉన్న వర్గాలు, కులాలు చాలా సులువుగా ఆర్థికంగా నిలుదొక్కగలుగుతున్నారు.ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా తేడా ఉంది. గ్రామాల్లో మరింత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరిగింది. చిన్న, సన్నకారు రైతులు దివాలా తీస్తున్నారు. ఈ భూములన్నింటిని కంపెనీలు, కార్పొరేట్లు కొనుగోలు చేస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ భూములన్నీ కార్పొరేట్ వ్యవసాయానికి మారబోతున్నాయి. దీని వల్ల ఇప్పటికే నూటికి 60 శాతం మంది యువతీ యువకులు గ్రామాలను వదిలి పట్టణాలకు, నగరాలకు చేరుతున్నారు. దాని ఫలితంగా భారత దేశంలో పట్టణీకరణ, నగరీకరణ వేగం పుంజుకుంటున్నది.
పెరుగుతున్న నిరుద్యోగం మరిన్ని సమస్యలకు కారణమవుతున్నది. ముఖ్యంగా మత్తు పదార్థాలకు, గంజాయికి యువలోకం బానిసగా మారిపోతున్నది. గతంలో లాగా తమ శ్రమతో సంపాదించుకొని కలో గంజో తాగి ఆత్మగౌరవంతో బతికే తరం పోతున్నది. పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో పరాన్న జీవులుగా మారిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది.
ఇట్లా చాలా సమస్యలున్నాయి. మహిళలు, బాలికల మీద పెరుగుతున్న లైంగిక దాడులు గతంలో కన్న పెచ్చుమీరిపోయాయి. పట్టణాల్లో, నగరాల్లో ఇది అంతు అదుపు లేకుండా పోతున్నది. 75 సంవత్సరాలు రాజ్యాంగం అమలు తర్వాత ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఒక చెత్త కాగితం లాగా చూస్తున్నయి. తమ వాదనకు పనికి వచ్చే ఆర్టికల్స్‌ను, తమ ప్రయోజనాలను కాపాడే అంశాలను అమలు చేస్తూ ప్రజల్లో మత, ప్రాంత కుల పరమైన విభజనలు తీసుకొచ్చి ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నారు. పేదల్లో అణగారిన వర్గాల్లో చీలికలను సృష్టించి, ప్రతిఘటన ఆలోచనలను, ఉద్యమాలను బలహీన పరుస్తున్నాయి.
ఇటీవల దళితుల, ఆదివాసుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలను పట్టించుకొని వాటిని నిరోధించడానికి చర్యలు లేవు. రిజర్వేషన్ల అంశాన్ని ఆధిపత్య కులాలను రెచ్చగొట్టడానికి వాడుకుంటున్నారు. అదే విధంగా ప్రతి అంశంలో ఒక కేంద్రీకృత వ్యవస్థలను తయారు చేస్తున్నారు. వ్యాపారాలను, వాణిజ్య అవకాశాలను తమ ప్రయోజనాలను కాపాడే వాళ్లకు ధారాదత్తం చేస్తున్నారు. దాని ఫలితంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. జరిగే అవకాశాలు పెరిగాయి. ఇటీవల ఇండిగో విమాన కంపెనీ నిర్వాకం మనకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఏ రంగమైనా, ఏ వ్యాపారమైనా గుత్తాధిపత్యంలోకి వెళితే అది ప్రజల ప్రయోజనాలను మింగేస్తుందని తేలిపోయింది. అదే విధంగా మతం, కులం, ప్రాంతం అన్ని కూడా అదే ఫలితాలను అందిస్తాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 38 ప్రకారం, దేశంలోని వనరులు, సంపద అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు, ప్రజలకు సమ న్యాయం అందాలని సూచిస్తున్నది. కాని దీనికి భిన్నంగా ఈ రోజు దేశంలో సంపద ఒక దగ్గర కేంద్రీకృతమవుతున్నది. పేదలు లేరు, పేదరికం లేదు అని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. కాని గ్రామాలు, బస్తీలు పరిశీలన జరిపితే ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో మనకు అర్థం కాదు. అన్ని విషయాలను ఇక్కడ ఏకరువు పెట్టడం సాధ్యం కాదు. అన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావించడం కూడా నా ఉద్దేశం కాదు. కాని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార బాధ్యత ప్రభుత్వాలదే. దానికి వేదిక పార్లమెంటు. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వాలు, శాసన సభలను, పార్లమెంటు వేదికను పరస్పర దూషణలకు, విమర్శలకు, ప్రతి విమర్శలకు కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం వెచ్చిస్తే మంచిది.
మల్లేపల్లి లక్ష్మయ్య