హైదరాబాద్: కోల్‌కతా ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర పోలీసులు బందోబస్తు పెంచారు. ఉప్పల్ స్టేడియానికి డిజిపి శివధర్‌రెడ్డి చేరుకున్నారు. భద్రతా సిబ్బందికి డిజిపి శివధర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. కోల్‌కతా ఘటనను స్క్రీనింగ్ చేసి చూపించారు. స్టేడియంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఇప్పటికే స్టేడియం దగ్గర 3 వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. కోల్‌కతా లాంటి ఘటనలు జరగకుండా హైదరాబాద్‌లో ముందస్తు చర్యలు తీసుకుంది. టిక్కెట్లు లేనివారు స్టేడియం పరిసరాల్లోకి రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
మెస్సీ కనిపించలేదని కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు బీభత్సం సృష్టించారు. వేలల్లో ఖర్చు చేసి టికెట్ కొంటే కనీసం మెస్సీ కనిపించలేదని అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్టేడియంలోని బారికేడ్లను దాటుకొని కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి, టెంట్లను ధ్వంసం చేశారు. మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయారని స్టేడియంలో అభిమానులు గందరగోళం సృష్టించారు. ఫ్యాన్స్ గొడవ చేయడంతో సొరంగం ద్వారా మెస్సీ టీమ్ బయటకు వెళ్లిపోయింది.
కోల్‌కతా మెస్సీ పర్యటన ఏర్పాట్లపై గవర్నర్ సివి ఆనంద్ బోస్ సీరియస్ అయ్యారు. బెంగాల్ ప్రభుత్వాన్ని గవర్నర్ నివేదిక కోరారు. మెస్సీ టూర్‌లో గందరగోళంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారీ చెప్పారు. మెస్సీ అభిమానులు క్షమించాలని మమతా కోరారు. మెస్సీ టూర్‌లో నిర్వహణ లోపం ఉందని అంగీకరించారు. మెస్సీ టూర్‌లో గందరగోళం నెలకొనడంతో విచారణ కమిటీ వేశారు.