మన తెలంగాణ/కోల్‌కతా: ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సి కోల్‌కతా పర్యటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. స్థానిక ప్రఖ్యాత సాల్ట్‌లేక్ స్టేడియంలో శనివారం నాటి చిరకాల ఎగ్జిబిషన్ మ్యాచ్ రభసకు దారితీసింది. 50 వేల మందికి పైగా తరలివచ్చిన మెస్సి అభిమానులు, ఫుట్‌బాల్ వీరాభిమానుల సందడితో మహానగరం హోరెత్తింది. స్థానిక వివేకానంద యువభారతి సాల్ట్‌లేక్ స్టేడియంలో కిక్కిరిసిన జనం కేకలు అరుపులు , దాదాపుగా అరాచక పరిస్థితితో విసిగెత్తిన మెస్సి కేవలం ఈ మ్యాచ్‌లో కొద్ది నిమిషాల పాటు ఆడినట్లుగా చేసి భద్రతావలయంతో కనీసం ఫ్యాన్స్ వైపు చూడకుండానే వెళ్లిపోయారు. మెస్సీ.. మెస్సీ.. అని ఒకవైపు నినదిస్తుండగానే ఆయన వెళ్లిపోయినట్లు గుర్తించిన అభిమానులు ఆగ్రహోదగ్రులయ్యారు. స్టేడియంలో విధ్వంసానికి దిగారు. కుర్చీలను , బారికేడ్లను విరగొట్టారు. మైదానంలోకి బాటిళ్లు విసిరివేశారు. వేలాది బెంగాలీ ఫుట్‌బాల్ అభిమానులకు చేదు అనుభవంగా మారింది. భారతీయ ఫుట్‌బాల్, స్థానిక ఫుట్‌బాల్ సంఘం ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం వైఫల్యం , నిర్వహణా ఏర్పాట్ల లోపాలతో మెస్సి పర్యటన ప్రహసనంగా మారింది. సరైన పోలీసు భద్రత లేకపోవడం, మ్యాచ్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి పలు కారణాలు బయటపడ్డాయి.
నేతలు, వివిపిఐపిల సెల్ఫీలతో చేజారిన పరిస్థితి
మ్యాచ్‌కు ముందు అక్కడ రాజకీయ నాయకులు వివిఐపిలు పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది, నిర్వాహకులు చేరుకోవడం, ప్రేక్షకులను పట్టించుకోకుండా వారిని కంట్రోల్ చేయకుండా వేదికపై, స్టేడియంలో సెల్ఫీలకు దిగుతూ ఉండటంతో పరిస్థితి దిగజారింది. దీనితోనే మెస్సీ తీవ్ర ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లారు. మెస్సీ అర్థరాత్రి కోల్‌కతా రాక దశలో విమానాశ్రయంలో తరువాత తెల్లవారుజామున మ్యాచ్‌కు ముందు స్టేడియం వద్దకు ఆయనను చూసేందుకు జనం తరలివచ్చారు. స్టేడియంలో అర లక్ష మంది వరకూ మెస్సీ మెస్సీ అంటూ నినాదాలకు దిగారు. ఇక్కడి మెహన్ బగన్, డైమండ్ హార్బర్ ఇసికి చెందిన మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులు నెంబరు 10 జెర్సీలతో 35 నిమిషాల ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. ఇందులో మెస్సి ఉన్నది కేవలం 20 నిమిషాలే . అయితే మెస్సీ వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఇతరుల అరాచకం విచ్చలవిడిగా సాగింది. ఛెయిర్స్, ట్రాఫీలు , సిఎం ఎన్‌క్లోజర్‌లోని ఫర్నిచర్ అంతా ధ్వంసం అయింది.
నెల రోజుల జీతంతో ఇంతటి వెతలా?
నెలరోజుల జీతం పెట్టి, చివరికి ఇక్కడి రూ 200కు కూల్ డ్రింక్, మంచినీరు బాటిల్ తీసుకుంటే మెస్సీని చూడలేకపోయాం. ఇంతకూ రాజకీయ నాయకులు సెల్ఫీలు దిగేందుకు ఇక్కడి కార్యక్రమం ఏర్పాటు అయిందా? అని పలువురు ఫ్యాన్స్ నిలదీశారు. ప్రేక్షకులు ప్రశాంతంగా ఉండాలని కార్యక్రమ ప్రమోటర్ సతద్రు దత్తా గద్గద కంఠంతో వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది.ఈ లోగానే మెస్సీ కోల్‌కతా పర్యటన ముగించుకుని హడావిడిగా హైదరాబాద్ చేరుకునేందుకు విమానాశ్రయానికి వెళ్లారు.
వెనుదిరిగివెళ్లిన షారూక్, మమతా బెనర్జీ
స్టేడియంలో గందరగోళంతో అప్పటివరకూ వివేకానంద విగ్రహం వద్ద వేచి ఉన్న సూపర్‌స్టార్ షారూక్ ఖాన్ అక్కడి నుంచి జారుకున్నారు. ఈ లోగా క్రికెటర్ సౌరవ్ గంగూలీ అక్కడికి వచ్చారని వదంతులు విన్పించాయి. దీనితో జనం మరింతగా చెలరేగిపోయారు. కాగా వేదిక వద్దకు అప్పుడే బయలుదేరిన సిఎం మమత బెనర్జీ పరిస్థితి గురించి తెలియగానే మధ్యలోనే వెనకకు వెళ్లారు.