తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కేరళ రాజకీయాల్లో సరికొత్త చరిత్రగా ప్రధాని మోడీ అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలు చేసిన కృషివల్లనే దాదాపు 45 ఏళ్లుగా ఈ స్థానంలో అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్‌ను ఓడించగలిగినట్టు పేర్కొన్నారు. ఈ విజయం కోసం శ్రమించిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు. తిరువనంతపురం అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి బీజెపీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
ఎన్నికల ఫలితాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి: శశిథరూర్
ఈ ఫలితాలు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసించారు. విజయం సాధించిన బీజేపీ నేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 45 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్ చేస్తున్న అక్రమాలను చాలాసార్లు ప్రశ్నించానని, వారి పాలన నుంచి బయటపడాలని ప్రజలు కూడా కోరుకుంటున్నట్టు ఈ ఫలితాలతో తేలిందన్నారు.
అనుకున్న ఫలితాలు సాధించలేక పోయాం: పినరయి విజయన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేక పోయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం మొత్తం మీద ఘనవిజయం సాధిస్తామని అంచనా వేశామని , కానీ అనుకున్నట్టు సాధించలేకపోయామని అన్నారు. దీనికి కారణాలేమిటో విశ్లేషించుకుని అవసరమైన సవరణలు చేసుకుని, ముందుకు వెళ్తామన్నారు. వచ్చే ఏడాది కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, తాజాగా జరిగిన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు , మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 45 ఏళ్ల తరువాత కామ్రేడ్ కోటలో బీజేపీ పాగా వేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. కేరళ స్థానిక సంస్థలకు డిసెంబర్ 9,11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి.మొదటి దశలో70.91 శాతం, రెండో దశలో 76.08 శాతం పోలింగ్ జరిగింది.