ఇటీవల కాలంలో ఎన్నికల్లో వస్తున్న మార్పులను పరిశీలిస్తే… నోటుతో ఓటు పొందడం నిలబడ్డ అభ్యర్థుల సంస్కృతిగా మారితే.. ఓటుతో నోటు పొందడం సామాన్య ప్రజల హక్కుగా మారిపోతుంది. దీంతో అభ్యర్థులు గెలిచిన తరువాత అధికారంతో అవినీతికి వైపు వెళ్తే, ఓటర్లు ప్రలోభాలకు గురై అంధకారంలోకి వెళ్తున్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చివరికి అభివృద్ధి కూడా శూన్యం అవుతుంది. నిజమైన ప్రజా సేవ చేసే నాయకులు ఎన్నికలకు దూరమవుతున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు, మద్యం ప్రవాహంతో గొప్పగా వర్ధిల్లుతున్న పల్లె సంస్కృతి విధ్వంసం అవుతుంది. స్వార్థ రాజకీ యాలతో ఈర్షా, ద్వేషం, పగ, ప్రతీకారాలు పెచ్చరిల్లుతున్నాయి. నేటికి గ్రామీణ ప్రజల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలకు తీరలేదు. దీనికి ప్రధాన కారణం ఓటర్లు నీతి, నిజాయితీలతో ఓటు వేయకపోవడమే. మరోవైపు ప్రలోభ పెట్టే రాజకీయ నాయకులను తిరస్కరించకపోవడం కూడా.
స్వాతంత్య్ర అనంతరం భారత దేశంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా స్థానిక స్వపరిపాలన కోసం మూడంచెల ‘పంచాయతీ రాజ్ వ్యవస్థ’ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయి. మన దేశంలో గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని ఆకాంక్షిస్తూ భారత ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికనుగుణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండవసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. సార్వత్రిక వయోజన ఓటు హక్కును భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడికి కల్పించబడింది. ఇది కుల, జాతి, మత,లింగ, భాష వంటి భేదం లేకుండా కల్పించిన సార్వత్రిక సమానత్వ హక్కు. ‘ఒక ఓటు ఒక విలువ’ అనే సూత్రం ద్వారా ప్రజానిధులను ఎన్నుకునే అవకాశం రాజ్యాంగం సామాన్యులకే ఇచ్చింది. ఓటనే ఆయుధంతో ప్రజాస్వామ్య విప్లవానికి పునాది వేసిన వ్యక్తి అంబేద్కర్. అణచివేయబడిన వర్గాల గొంతుకకు ప్రాణం పోసి కుల, మత గోడలను బద్దలుగొట్టే ప్రయత్నం చేశారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఓటు హక్కు కోసం పోరాటాలు జరిగాయి. భారతదేశంలో మాత్రం అంబేద్కర్ ఒక్కరే పోరాటం చేశాడు. ముఖ్యంగా ఈ దేశంలో మనుషులుగానే గుర్తించని బిసి, ఎస్‌సి, ఎస్‌టి సమాజాన్ని ఓటుతో విలువ లభించింది. నేడు ఆ ఓటు ఒక సరుకుగా, ఎన్నికల వ్యవస్థ ఒక మార్కెట్ గా మారి ఒక ధనస్వామ్య వ్యవస్థకు దారితీయడం జరుగుతుంది. తద్వారా అభివృద్ధి, సంక్షేమం ముసుగులో దోపిడీ రాజ్యమేలుతుంది. అంబేద్కర్ ‘నేను నా దేశ ప్రజలకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చాను. అది కత్తి కంటే పదునైంది. దాని సాయంతోనే పోరాడి రాజవుతారో… అమ్ముకుని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది వారే’ చెప్పారు. ప్రజలంతా భవిష్యత్ పునర్నిర్మాణానికి నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సందర్భం ఇది.
ప్రలోభ పెట్టే నాయకుల్ని తిరస్కరిద్దాం
తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు రెండవ, మూడవ దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలబడిన అభ్యర్థులు ఓటర్లను విపరీతంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. సామాన్యుల నుంచి బాగా చదువుకున్న విద్యావంతుల సైతం ప్రలోభాలకు గురికావడం ఆందోళన కలిగిస్తుంది. వివిధ కులాల దళారి నాయకులు తమ కులం ఓట్లు మీకేనని అభ్యర్థులకు చెబుతూ డబ్బులు వసూలు చేస్తూ కులాన్ని తాకట్టు పెడుతున్నారు. మరోవైపు దళారుల సహకారంతో అభ్యర్థులు నిత్యం మందు పార్టీలతో ఓటర్లను మత్తులో ముంచుతున్నారు. ఓటుకు వెయ్యి నుంచి ఐదు, పది వేలు పెట్టి ఓట్లు కొంటున్నారు. ఓటు ఒక వేలం పాటగా మారిపోయింది. అమాయక దళిత, బహుజనుల్ని ఓటు మార్కెట్‌లో బలి చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్నికల్లో వస్తున్న మార్పులను పరిశీలిస్తే… నోటుతో ఓటు పొందడం నిలబడ్డ అభ్యర్థుల సంస్కృతిగా మారితే.. ఓటుతో నోటు పొందడం సామాన్య ప్రజల హక్కుగా మారిపోతుంది. దీంతో అభ్యర్థులు గెలిచిన తరువాత అధికారంతో అవినీతికి వైపు వెళ్తే, ఓటర్లు ప్రలోభాలకు గురై అంధకారంలోకి వెళ్తున్నారు.
ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చివరికి అభివృద్ధి కూడా శూన్యం అవుతుంది. నిజమైన ప్రజా సేవ చేసే నాయకులు ఎన్నికలకు దూరమవుతున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు, మద్యం ప్రవాహంతో గొప్పగా వర్ధిల్లుతున్న పల్లె సంస్కృతి విధ్వంసం అవుతుంది. స్వార్థ రాజకీయాలతో ఈర్షా, ద్వేషం, పగ, ప్రతీకారాలు పెచ్చరిల్లుతున్నాయి. నేటికి గ్రామీణ ప్రజల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అనారోగ్యం వంటి సమస్యలకు తీరలేదు. దీనికి ప్రధాన కారణం ఓటర్లు నీతి, నిజాయితీలతో ఓటు వేయకపోవడమే. మరోవైపు ప్రలోభ పెట్టే రాజకీయ నాయకులను తిరస్కరించకపోవడం కూడా. ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజలు ప్రతి వస్తువుపై కట్టే పన్నుల డబ్బుల ద్వారా జరుగుతుంది. ఇది ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకులు సొమ్ము కాదు. దీన్ని ఓటర్లు గుర్తెరగాలి. ఎన్నికలు ప్రతీ ఐదేళ్లకోసారి వస్తుంటాయి. ఈ ఐదు సంవత్సరాల కాలానికి అభ్యర్థులిచ్చే డబ్బు, మందు రోజుకు ఒక రూపాయి విలువ కూడా కాదు. కావున ఓటర్లు యాచకులుగా మారవద్దు. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దు. అసలు ప్రలోభ పెట్టే నాయకుడు ఎప్పటికీ ప్రజానేత కాదు. కావున మందు, డబ్బుతో ప్రలోభాలకు గురిచేసే నాయకులను తిరస్కరిద్దాం. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగమై నిజాయితీగా ఓటేసి గ్రామాభివృద్ధికి పాటుపడదాం.
సంపతి రమేష్ మహారాజ్
79895 79428