మన తెలంగాణ/గోషామహల్: బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై, చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పరామర్శించారు. శనివారం పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్‌తో కలిసి కింగ్‌కోఠిలోని జిల్లా ఆసుపత్రిని సందర్శించి, చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్యం గురిం చి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ ..రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై, రాహుల్ గాంధీ పర్యటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతినిత్యం ఏదో ఒక గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషితాహారం తిని, విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
మొన్న శామీర్‌పేట్ బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లే పరిస్థితి వచ్చిందని, దీంతో ప్రభుత్వంపై విద్యార్థులే ఫిర్యాదు చేశారని అన్నారు. నిన్న మాదాపూర్ చందు నాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 43 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారని, ఇప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకులంలో కలుషితాహారం తిని 90 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని అన్నారు. ఆసుపత్రిలో విద్యార్థులకు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ చేయడం లేదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటోందని, కానీ ఇది విజన్ 2047 కాదు..విద్యార్థుల పాలిట పాయిజన్ 2047గా మారిందని, పిల్లల పాలిట రేవంత్‌రెడ్డి పాయిజన్‌గా మారారని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్య్రార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని, కెసిఆర్ హయాంలో సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారం అందేదని, ఇప్పుడు దొడ్డు బియ్యం పెడుతున్నారని, అన్నం ఉడకడం లేదని, సరైన భోజనం పెట్టట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టివి యాడ్స్, పేపర్ యాడ్స్ కోసం మాత్రమే తెలంగాణ రైజింగ్… వాస్తవంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హాస్పిటల్స్‌లో ఫాలింగ్ అని పేర్కొన్నారు.