కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు వ్యతిరేకంగా మహిళలను ఉసిగొల్పారు. సవరణ తరువాత ఓటరు జాబితాలో తమ పేర్లు తొలగిస్తే వంటగది పనిముట్లతో సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యలు చేశారు. “ఎస్‌ఐఆర్ పేరుతో మీ తల్లులు, సోదరీమణుల ఓట్లను లాక్కుంటారా ? ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తారు. జాబితాలో మీ పేరు లేకపోతే మీ వద్ద వంటగదిలో వాడే పరికరాలు ఉన్నాయి కదా? వంటచేసేటప్పుడు వాడే ఆ పరికరాలు మీ బలం. మహిళలు ముందుండి పోరాడుతారు. మగవారు వారివెనుక ఉంటారు. మహిళలా లేక బీజేపీనా..? ఎవరు బలవంతులో చూడాలని అనుకుంటున్నాను. నేను లౌకిక వాదాన్నే నమ్ముతాను. ఇక్కడి ప్రజలను విభజించేందుకు ఎన్నికల సమయంలో బీజేపీ డబ్బు వాడి, వేరే రాష్ట్రాల నుంచి మనుషుల్ని దింపుతుంటుంది. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వంటివారు ఏనాడూ ప్రజలను విభజించలేదు. మరి మీరంతా ఎవరు ? భారత స్వాతంత్య్రం కోసం బెంగాల్ ప్రజలు ప్రాణాలు త్యాగం చేశారు. ఇప్పుడు భారత పౌరులుగా నిరూపించుకోవాలి” అని కృష్ణానగర్ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఈసీ బీజేపీ కమిషన్‌గా మారిందని, ఢిల్లీ నుంచి వచ్చిన సూచనల ప్రకారం నడుచుకుంటోందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలకు ఇటీవల ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. ఆ ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ఓటర్లను చేర్చడం, అర్హత లేనివారిని తొలగించడమే దాని ఉద్దేశమని, ఇదే సందేశం క్షేత్రస్థాయికి చేరేలా చూసుకోవాలని ఆదేశించారు.