తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 31 జిల్లాల్లో 84.28 శాతం పోలింగ్
మొత్తం 53,57,277 మంది ఓటర్లకు గాను 45,15,141 మంది ఓటు హక్కు వినియోగం
ఓట్లు వేసేందుకు గ్రామాల్లో వెల్లువెత్తిన ఓటర్లు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తయి, లెక్కింపు జరిగింది. తొలి దశలో 4,236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడగా వాటిలో ఐదు సర్పంచి పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 396 సర్పంచ్ పదవులు, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్, 10 వార్డు స్థానాల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. మిగిలిన 3,834 సర్పంచ్ పదవులకు గాను 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు గాను 65,455 మంది అభ్యర్థులు గురువారం జరిగిన ఎన్నికలో పోటీ చేశారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. మధ్యాహ్నాం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపు అనంతరం గెలిచిన వారి పేర్లను ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా తొలిదశ పోలింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును నియోగించుకున్నారు. వీరిలో 21,99,267 మంది పురుషులు, 23,15,796 మంది మహిళలు, ఇతరులు 78 మంది కలిపి మొత్తం 45,15,141 మంది ఓటు వేయగా అంటే 84.28 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం వెల్లండించింది. ఇదిలావుండగా పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా…
ఈ మేరకు జిల్లాల వారీగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 75.25 శాతం, భద్రాద్రి కొత్తగూడెం 71.79 శాతం, హన్మకొండ 83.95, జగిత్యాల 77.68, జనగాం 87.33, జయశంకర్ భూపాలపల్లి 83.59, జోగులాంబ గద్వాల్ 86.77, కామారెడ్డి 79.40, కరీంనగర్ 81.82, ఖమ్మం 90.16, కొమురంబీం ఆసిఫాబాద్ 78.78, మహబూబాబాద్ 86.99, మహబూబ్‌నగర్ 83.04, మంచిర్యాల 80.04 శాతం, మెదక్ 88.46, ములుగు 78.65, నాగర్‌కర్నూల్ 87.41, నల్గొండ 90.53, నారాయణ్‌పేట్ 84.58, నిర్మల్ 80.29, నిజామాబాద్ 81.37, పెద్దపల్లి 82.24, రాజన్న సిరిసిల్ల 79.57, రంగారెడ్డి 88.67, సంగారెడ్డి 87.96, సిద్దిపేట 87.76, సూర్యాపేట్ 90.18, వికారాబాద్ 81.21, వనపర్తి 84.94, వరంగల్ 86.83, యాదాద్రి భువనగిరి జిల్లా 92.88 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.