మన తెలంగాణ / హైదరాబాద్ : ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్‌కి రానున్నారు. భారత పర్యటనలో భాగం గా ఈ అర్జెంటీనా స్టార్ హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. మెస్సీ హైదరాబాద్ రా నుండటంతో నగరంలో క్రీడా సందడి మొదలైంది. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో మెస్సీ గౌరవార్థం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు జొ మాటో యాప్, వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి. ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మేస్సీ ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం 7 గంటల కు ఈవెంట్ జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ పర్యటనను ఇప్పటికే ధృవీకరించారు. మేస్సీ భారత పర్యటన జాబితాలో కోల్‌కతా, ముంబాయి, న్యూ ఢిల్లీతో పాటు హైదరాబాద్‌ను చేర్చడం దక్షిణాదితో పాటు తెలుగు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇది కేవలం ఫుట్‌బాల్ మ్యాచ్ మాత్రమే కాకుండా యువ క్రీడాకారుల కోసం ఫుట్‌బాల్ క్లినిక్, సెలబ్రిటీల మ్యాచ్, మ్యూజికల్ షో, సన్మాన కార్యక్రమంతో కూడిన ఒక భారీ స్పోర్ట్ ఈవెంట్ కానుంది.
టికెట్ ధర రూ.1,750 నుంచి 30 వేలు : ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ స్టేడియం లో ఓ సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. అనంతరం మెస్సీని సన్మానించి, ఒక సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఫుట్‌బాల్ అభిమానులు, క్రీడా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.టికెట్ల ధరలను నిర్వాహకులు రూ.1750 నుంచి రూ.30,000 వరకు నిర్ణయించారు. ప్రస్తుతం రూ.2,000, రూ.3,250, రూ.5,000, రూ.7,000, రూ.8,000, రూ.13,500 కేటగిరీల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధిక ధర కలిగిన రూ.30,000 టికెట్ కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక హాస్పిటాలిటీ సదుపాయాలు కల్పించనున్నారు. మెస్సీ ఈవెంట్ టికెట్లను ‘డిస్ట్రిక్ట్ బై జొమాటో’ యాప్ నుంచి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. చివరి కొన్ని టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా మెస్సీ అభిమానులు హైదరాబాద్ తరలివచ్చే అవకాశం ఉంది. మెస్సీ పర్యటన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాడిని ప్రత్యక్షంగా చూసే అవకాశం హైదరాబాద్‌లో దొరుకుతుండటంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తో ఫ్రెండ్లీ మ్యాచ్ : మెస్సీ పర్యటనలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో ఆట గురించే చర్చ సాగుతోంది. దీంతో ఇప్పుడు మేస్సీ, సీఎం రేవంత్ రెడ్డి టీమ్స్ మధ్య జరగనున్న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ‘ఆర్‌ఆర్ 9’ జెర్సీ ధరించనుండగా మెస్సీ ‘ఎల్‌ఎం 10’ జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. ‘ది గోట్ ఇండియా టూర్’ అనే ట్యాగ్‌లైన్ ప్రస్తుతం ప్రపంచ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. హైదరాబాద్‌లో ఈ నెల 13న ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫుట్‌బాల్ అభిమానులు సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం అమితాసక్తి కనబరుస్తున్నారు. తొలుత ప్రముఖ రంగాల్లోని సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఒక జట్టుకు స్వయానా సీఎం రేవంత్‌రెడ్డి, మరో జట్టుకు మెస్సీ సారథ్యం వహిస్తారు. అనంతరం యువ ప్రతిభావంతులతో మెస్సీ మాస్టర్ క్లాస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహిస్తారు. ఇక చివరగా మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతుంది. ఆరోజు రాత్రి మెస్సీ హైదరాబాద్ నగరంలోనే బస చేసి 14న ఉదయం ప్రత్యేక విమానంలో ముంబయికి బయల్దేరతారు.
కాగా, మెస్సీ- గోట్ ఫుట్ బాల్ మ్యాచ్‌కు హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మ్యాచ్ కు పాస్ లేకుంటే ఎంట్రీ లేదని స్పష్టం చేశారు.
ఏర్పాట్లు పూర్తి : చీఫ్ అడ్వైజర్ పార్వతీ రెడ్డి
ఈనెల 13న సాయంత్రం 4 గంటలకు లియోనల్ మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారని ఆయన చీఫ్ అడ్వైజర్ పార్వతీ రెడ్డి తెలిపారు. టూర్ కు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మెస్సీ రాకతో ఫుట్ బాల్ కు తెలంగాణ రాష్ట్రంలో మరింత ఆదరణ పెరుగుతుందని, క్రీడాకారులు కూడా పెరుగుతారని తెలిపారు. మెస్సీ వచ్చే స్టేడియంలోకి వచ్చే ముందు 2 గంటల పాటు సంగీత విభావరి ఉండబోతుందని పార్వతి తెలిపారు. హైదరాబాద్ కల్చర్‌ను ఇంటర్నేషనల్ స్థాయిలో పెట్టాలని నగరానికి చెందిన ఒక యంగ్ ర్యాపర్‌తో స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మరో ముగ్గురు సింగర్లు ఉంటారన్నారు.