ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన సింగరేణి శాఖను సీఎం రేవంత్ టీమ్‌కు స్పాన్సరుగా ఉండడానికి ఎందుకు అంగీకరించారో చెప్పాలని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిలదీశారు. సిఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి పూర్తిగా సరెండర్ అయ్యారని విమర్శించారు. భట్టి ఆర్ధిక శాఖ బిల్లుల క్లియరెన్సుకు 30 శాతం కమిషన్లు తీసుకుంటున్నా సీఎం పట్టించుకోవడం లేదని, అందుకే ఇపుడు సీఎం రేవంత్ ఫుట్ బాల్ సరదా కోసం డిప్యూటీ సీఎం తన సింగరేణి శాఖ ద్వారా పూర్తిగా సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగానే ఈ ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ అని సిగ్గులేకుండా చెప్తున్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఈ ఫుట్ బాల్ మ్యాచ్ తో తెలంగాణ ఎలా రైజింగ్ అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు గ్లోబల్ సమ్మిట్ ప్లానింగ్‌లో ఈ ఫుట్ బాల్ మ్యాచ్ లేనే లేదని తెలిపారు.
కేరళ ప్రభుత్వం ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించడం తమ వల్ల కాదని నిరాకరిస్తే, మెస్సీ ఇండియా టూర్‌ను ప్లాన్ చేసిన ఈవెంట్ ఆర్గనైజేషన్ సీఎం రేవంత్ రెడ్డిని ముంబైలో కలిసి తెలంగాణలో నిర్వహించాలని కోరారు. బీఆర్‌ఎస్ సర్కార్ ఈ కార్ రేసింగ్ ఈవెంట్ ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందంటున్న రేవంత్ సర్కార్ మరి ఇప్పుడు ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడం అంటే ప్రజాధనం దుర్వినియోగం కాదా అని ఏలేటి నిలదీశారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి శిక్షార్హుడు కాదా అని వ్యాఖ్యానించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా శుక్రవారం హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.