మన తెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు అనూహ్య పరిణామం ఎదురయింది. శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారుల ఎదుట బేషరతుగా లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ అధికారుల ముందు హాజరు కావాలని ఆయనకు స్పష్టం చేసింది. సిట్ అధికారి ఏసిపి వెంకటగిరి ఎదుట హాజరుకావాలని ప్రభాకర్ రావుకు ధర్మాసనం సూచించింది. ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రత్యేక రిలీఫ్, ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ గురువారం మరోసారి న్యాయమూర్తి జస్టిస్ బి.వి నాగరత్నం, ఆర్.మహదేవన్ లతో కూడిన డివిజన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ సమయంలో ప్రభాకర్ రావును ఎటువంటి టార్చర్ చేయవద్దంటూ సిట్ అధికారులకు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. కస్టడి సమయంలో ప్రభాకర్ రావుకు ఇంటి నుంచి భోజనాన్ని తీసుకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. మరో వైపు ఈ కేసులో 14 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారణకు అనుమతించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. నిందితుడు ప్రభాకర్ రావుకు ప్రత్యేక రక్షణ కల్పిస్తూ విచారణకు సహకరించాలని న్యాయస్థానం చెప్పినా ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఐక్లౌడ్ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేసి అందులోని వివరాలను దర్యాప్తు అధికారులకు చూపించాలని కోర్టు ప్రభాకర్‌రావుకు చెప్పిందని గుర్తు చేశారు.
కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఐదు పాస్‌వర్డ్‌లలో కేవలం రెండు మాత్రమే ప్రభాకర్ రావు రీసెట్ చేశారని, అందులో డేటా ముందే తొలగించారని ధర్మాసనానికి తెలిపారు. ఈ దశలో న్యాయమూర్తి జస్టిస్ బి.వి నాగరత్న స్పందిస్తూ పిటిషనర్‌కు ప్రత్యేక రక్షణ కల్పించడం వల్ల దర్యాప్తునకు ఏ మాత్రం సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని దీనిపై సమాధానం చెప్పాలని ప్రభాకర్‌రావు తరపు న్యాయవాది రంజిత్ కుమార్‌ను ప్రశ్నించారు. పిటిషనర్ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారని, అందుకు సంబంధించిన పలు విషయాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసినట్లు న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు చెప్పారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.