హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సేవాభావం, నిజాయితీ ఎప్పుడూ ప్రత్యేకమేనని మరోసారి నిరూపితమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ కరుణ, డ్రైవర్ యూసీ మౌళి విధుల్లో చూపిన నిబద్ధత నిజంగా అభినందనీయమని కొనియాడారు. వర్కుల్–కోహెడ రూట్‌లో ప్రయాణించిన ఒక మహిళా ప్రయాణికురాలు పోగొట్టుకున్న విలువైన పుస్తెలతాడును బస్సులో వెతికి గుర్తించి, డిపోకు తీసుకెళ్లి అధికారుల సమక్షంలో యజమానికి అప్పగించారు. ఆర్ టిసి ఉద్యోగుల నిజమైన మానవత్వం, ధర్మబద్ధతకు నిలువెత్తు నిదర్శనమని పొన్నం మెచ్చుకున్నారు. రోజూ వేలాది మంది ప్రయాణికులు ఆధారపడే ఈ ప్రజా రవాణ సేవను మరింత విశ్వసనీయంగా నిలబెట్టేది ఇలాంటి ఉద్యోగుల నిజాయితీ, నిబద్ధతే అని కొనియాడారు. ప్రయాణికుల భద్రత, వారి వస్తువుల పరిరక్షణను అత్యంత బాధ్యతగా చూసుకుంటున్నామని, ఆర్ టిసి సిబ్బందికి మనస్ఫూర్తిగా వందనం తెలియజేస్తున్నామని, కరుణ, మౌళి వంటి ఉద్యోగులు ఉంటేనే ఆర్ టిసి ప్రజల హృదయాల్లో మరింత స్థానం సంపాదిస్తుందన్నారు. నిజాయితీ, సేవాభావానికి హృదయపూర్వక అభినందనలు పొన్నం తెలిపారు.