మన తెలంగాణ/హైదరాబాద్ : నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అంఖడ 2 సినిమాకు భారీ షాక్ తగిలింది. టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీఓను హైకోర్టు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అఖండ 2 సినిమా టిక్కెట్ల ధరలు పెంపు జీఓను సవాల్ చేస్తూ శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది గురువారం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎన్.వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారించిది. టికెట్ల ధరల పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ధర్మాసనం హోం శాఖపై ఆగ్రహాం వ్యక్తం చేసింది. టికెట్ ధరల విషయంలో ఏం జరుగుతుందని హోంశాఖ జీపిని ధర్మాసనం నిలదీసింది. ప్రతి సినిమాకు ధరలు పెంచుకునేందుకు పదేపదే జీఓలు జారీ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలంటే లేక్కలేదా అని హోంశాఖపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. టికెట్ ధరల విషయంలో గతంలోనే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది కదా అని ప్రశ్నించింది.
టికెట్ ధరలు పెంచుతూ మెమోలు జారీ చేయడం కోర్టు ధిక్కరణ కాదా అని, ఇలాంటి మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని హోంశాఖ జీపిని ధర్మాసనం అడిగింది. ఈ క్రమంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని జీపిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ దశలో ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా కొత్తగా నియమితులయ్యారని కోర్టు ఆదేశాలపై పూర్తి అవగాహన లేదని జీపి కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అఖండ2 సినిమా ప్రీమియర్ షోతో పాటు టికెట్ ధరలను పెంచుతూ జారీ చేసిన జీఓను రద్దు చేసింది. ఈ క్రమంలో హోంశాఖ, నిర్మాత 14 రీల్స్ ప్లస్, ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, అఖండ 2 సినిమా ప్రీమియర్ షో, టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీఓలో గురువారం రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోకు రూ.600 టికెట్ ధరను నిర్ణయించింది. శుక్రవారం నుంచి సింగిల్ స్కీన్‌కు రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లకు రూ.100 అదనంగా పెంచుకునేలా అనుమతిచ్చింది. ఈ టికెట్ల రేట్లు 12, 13, 14 తేదీల్లో మాత్రమే పెంచుకునేలా జీఓలో హోంశాఖ స్పష్టం చేసింది.
అప్పుడు ఓజి ఇప్పుడు అఖండ 2
ఇటీవల కాలంలో సినిమా రేట్ల పెంపు విషయం తీవ్ర దుమారం చెలరేగుతొంది. కొత్త సినిమా విడుదల అవుతన్న క్రమంలో సదరు నిర్మాతలు టిక్కెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరిన తరుణంలో ప్రభుత్వం ఒక దశలో పది రోజుల పాటు టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఇష్టారీతిన టిక్కెట్లు ధరలు పెంచుతున్నారంటూ ప్రజల నుండి ఆగ్రహావేశాలు వెల్లువెత్తడం, పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా విషయంలో సైతం టిక్కెట్ల ధరల పెంచుకునేందుకు ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించడంతో సదరు జీఓను కోర్టు రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ నిర్మాత, ఫిలిం డెవలెప్‌మెంట్ కార్పొరేషన్‌లు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలో హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేసి ఓజి సినిమాకు టిక్కెట్ల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అఖండ 2 సినిమాపై దాఖలయిన పిటిషన్ విచారణలో హైకోర్టు జీఓ రద్దు చేయడంతో పాటు ఇలా ఎందుకు జీఓలు జారీ చేస్తున్నారంటూ హోం శాఖపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సినిమా విడుదలకు సిద్దం కావడం, ఇప్పటికే సినిమా టిక్కెట్లు దాదాపుగా అమ్ముడు కావడంతో కోర్టులో విచారణ కీలకం కానుంది.