రకరకాల జాతులు, సమూహాల సమాహారమే ఈ దేశం. భిన్న భాషలు, సంస్కృతులు ఈ దేశంలో ఉన్నా, అవన్నీ దేశ సార్వభౌమాధికారానికి తలఒగ్గి తమ మనుగడను నిలుపుకుంటున్నాయి. వీటికి తోడు మనదేశంలోని కులాలు, మతాలు, రకరకాల సిద్ధాంతాలతో కూడిన రాజకీయ పార్టీలు మితవాదులు, మతవాదులు, అతివాదులు, జాతీయవాదులు వెరసి మనం ఘనంగా చెప్పుకునే భిన్నత్వంలో ఏకత్వం. ఇంత పెద్ద దేశంలో సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండడం సహజమే. కొందరు అహింసా వాదాన్ని అనుసరించడం ప్రచారం చేయడం జరిగితే, మరికొందరు హింసవాదాన్ని, ఆయుధాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వీరంతా దేశాభివృద్ధిని కాంక్షించే వారే కానీ మార్గాలే వేరు. ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించబడిన రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూల్ ప్రకారం అటవీ ప్రాంతాలలోని గిరిజనులకు ప్రత్యేకమైన హక్కులు కల్పించబడ్డాయి. అడవికి వారే రాజు లాంటివారు. కానీ ప్రభుత్వాలు క్రమంగా అడవులలోని ఖనిజ వనరుల మీద కన్నేశాయి. ఇన్నాళ్లుగా వాటిని అక్కడి గిరిజనులే కాపాడుకుంటున్నారు.
కానీ కార్పొరేట్ కంపెనీలకు ఖనిజ వనరులను ధారాదత్తం చేసే ప్రయత్నంలో గిరిజనులు, వారికి మద్దతుగా ఉన్న మావోయిస్టులు అడ్డుగా నిలుస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు పూనుకున్నది. మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత దేశమే ధ్యేయంగా అడవులను జల్లెడపడుతూ మావోల ఆచూకీ ఆనుపానులు తెలుసుకుంటూ ఎన్‌కౌంటర్ పేరు మీద వారిని మట్టుపెడుతున్నారు. మావోయిస్టు ఉద్యమం ఈ నేపథ్యంలోనే కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. పెద్ద నాయకులను కోల్పోయింది. మరి కొంతమంది నేతలు రకరకాల కారణాలతో రాజ్యానికి లొంగిపోయారు. కాల్పులు ఏకపక్షమే, మృతులు ఏకపక్షమే. యుద్ధం విరమించిన వారిపై కాల్పులు జరపడం యుద్ధ నీతి కాదు. అస్త్ర సన్యాసం ప్రకటించిన వారితో యుద్ధం ఎలా చేస్తారు? ఇది నాటి రాజుల కాలంలో కూడా జరగలేదు.
కానీ ఘనత వహించిన ప్రజాస్వామ్యంలో జరగడం శోచనీయం. గిరిజనులలోనే కాదు సమాజంలోనూ మావో ‘యిస్టు’ ల మద్దతుకు సానుభూతికి కొదవలేదు. అందరూ తుపాకీ పట్టి పోరాడలేకపోవచ్చు. నైతిక మద్దతు ఇచ్చేవారు చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. కానీ వారిని అర్బన్ నక్సలైట్లు అనే పేరుతో అంతమొందించే ప్రమాదము లేకపోలేదు. ఈ మధ్య వరుస ఎన్‌కౌంటర్లలో చాలామంది మావోయిస్టులు తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. రాష్ట్రంలో గతంలో జరిగిన అనేక ఎన్‌కౌంటర్లు బూటకమని నిరూపించబడ్డాయి. పరిమిత స్థాయి ఉద్యమంపైన రాజ్యం పైచేయి సాధించింది. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఇష్టం లేకపోయినా మావోయిస్టులు శాంతి ప్రక్రియ ప్రతిపాదన చేశారు. కానీ రాజ్యం అందుకు ఒప్పుకోక తన లక్ష్యం పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉంది. బందూకులతోనే బదులు చెప్పింది.
హింస ఎవరు చేసినా ఖండించదగినదే. హింసకు ప్రతి హింస సమాధానం కాదు. సిద్ధాంతం నచ్చనంత మాత్రాన అవతలి వ్యక్తిని చంపే హక్కు మన రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదు. రాజ్యానికి కూడా ఇవ్వలేదు. ఉద్యమ బాటను ఎంచుకున్న వారు అటవీ సంపదను, ఖనిజ వనరులను సంరక్షిస్తూ గిరిజనులకు అండగా నిలుస్తూ వచ్చారు. కానీ రాజ్యం మాత్రం యథేచ్ఛగా తన బలాన్ని ప్రయోగిస్తూ, సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించుతూ మావోయిస్టులను మట్టుబెట్టుతున్నది. పర్యవసానంగా చిన్నతనంలోనే అడవి బాట పట్టి గత 30, 40 ఏళ్లుగా గిరిజనులతో మమేకమై తల్లిదండ్రులకు తమ కుటుంబాలకు దూరంగా ఉన్నవారు తమ వ్యక్తిగత జీవితాన్ని, సుఖాన్ని, సంతోషాలను త్యాగం చేసిన వారు నేడు ఎన్‌కౌంటర్లలో నేలకొరుగుతున్నారు. ఆ నేతల అంత్యక్రియలలో వారి పట్ల ప్రజలకు ఉన్న ఆదరాభిమానాలు పెద్ద ఎత్తున పెల్లుబికాయి. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం సడలేలా చేసింది రాజ్యం. మావోయిస్టుల మార్గం నచ్చడం నచ్చకపోవడం వేరే విషయం. కానీ వారు కూడా ఈ సమాజ శ్రేయస్సు కోసం ఈ దేశ అభ్యున్నతి కోసమే పోరాడుతున్నారనేది సత్యం.
భారతదేశం శాంతికాముక దేశంగా చెప్పుకుంటాం. శాంతి సూక్తులన్నీ మనదేశంలో పుట్టినవే. అంతర్జాతీయంగా అనేక దేశాలతో శాంతి ఒప్పందాలు, ఒడంబడికలు చేసుకుంటాం. కానీ మనదేశంలోనే దాన్ని ఆచరించడానికి ప్రభుత్వం విముఖత చూపుతున్నది. మన శత్రుదేశాల పట్ల కూడా సంయమనం పాటిస్తాం. కానీ దేశంలోని అంతర్గత శక్తులు అది ప్రజా శ్రేయస్సు కోసం దేశంలోని ఖనిజ సహజ వనరుల సంరక్షణ కోసం పోరాడే వారి పట్ల కఠినంగా, కర్కశంగా, అమానవీయంగా ప్రవర్తిస్తున్నాం. వారేమీ దేశద్రోహులు కాదు. వారి దేశభక్తిని శంకించవలసిన పని కూడా లేదు. వారిమీ దేశ భద్రతకు భంగం కలిగించడం లేదు. సమాజంలో ఆదివాసీలు కూడా భాగమేనని, వారి రక్షణ, హక్కులు కాపాడడం గురించి, దేశ భవిష్యత్తు దృష్ట్యా ఖనిజ వనరుల సంరక్షణ గూర్చి మాత్రమే మావోలు పోరాటం చేస్తున్నారు. ఆదివాసీల సంరక్షణకు పెంపు వహించాల్సిన ప్రభుత్వం వారి చట్టాలకు తూట్లు పొడుస్తోంది. కార్పొరేట్ కంపెనీలకు ఎర్రతివాచి పరిచి అటవీ సంపదను దోచుకోవడానికి ఆహ్వానం పలకడం దారుణం. గిరిజన ఆదర్శ నేత బిర్సా ముండాను గౌరవిస్తాం కానీ ఆయన ఆశయాలను పక్కన పెడతాం.
ఎవరి హక్కుల గురించి డాక్టర్ బ్రహ్మదేవ శర్మ తన జీవితాంతం పోరాడాడో వారి శ్రేయస్సు మనకు పట్టదు. అవసరమైనప్పుడు అదే శర్మను ఒక జిల్లా కలెక్టర్‌ను విడిపించడానికి వాడుకుంటాం. అంతవరకే. ఆ తర్వాత ఆయన ఆకాంక్షలు తుంగలో తొక్కేస్తాం. కార్పొరేట్లు ఒకసారి కాలు పెట్టి తవ్వకాలు మొదలు పెడితే అడవిలో బూడిద కూడా మిగిల్చరు. గిరిజనులు ఇక అడవులను ఖాళీ చేయాల్సిందే. భావితరాలకు ఉపయోగపడే ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పనంగా అప్పగిస్తూ అందులో భాగంగా మావోయిస్టులను ఏరిపారేస్తూ రాజ్యం గిరిజనులను ఏకాకులను చేస్తున్నది. వారిని నిరాశ్రయులను చేస్తున్నది. భవిష్యత్తులో తలెత్తే పర్యావరణ సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అడవి తల్లిని నమ్ముకున్న వారు తమ అడవికి దూరం అవుతున్న పరిస్థితి నెలకొన్నది. వారికి ప్రత్యేక హక్కులు కల్పించిన ఐదు ఆరు షెడ్యూళ్ళు రాజ్యం వంక, తమ బిడ్డలైన గిరిజనుల వంక నిస్సహాయ చూపులు చూస్తున్నాయి.
‘చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం. ఫిబ్రవరి వరకు మాకు సమయం కావాలి. అంతవరకు ఆయుధాలను విసర్జిస్తున్నాం’ ఇలాంటి మాటలు శంఖం ఊదిన చందాన వృథా అయ్యాయి. ఎన్‌కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మావోయిస్టులు కనుమరుగవుతూనే ఉన్నారు. సాయుధ పోరాట విధానంపై మావోయిస్టులు సమీక్షలు చేసుకుంటున్నామన్న తరుణంలో ప్రభుత్వం వారిపై తన ప్రతాపం చూపింది. అడవిపై మావోలు తమకు పట్టు కోల్పోతున్నారు. మావోయిస్టుల ఒకనాటి ‘వర్గ శత్రు నిర్మూలన’ను నేడు కేంద్ర ప్రభుత్వం పక్కాగా, ప్రణాళికతో అమలు చేస్తున్నట్లుగా కనపడుతున్నది. వ్యక్తులు, నేతలు నేడు మరణించవచ్చు. కానీ సిద్ధాంతం ఎన్నటికీ మరణించదు. కానీ ఆ సిద్ధాంతకర్తలు తమ వాదాన్ని సమీక్షించుకోవలసిన సరియైన సమయం ఇది. ప్రభుత్వం కూడా మావోల సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా చూడాలి.
వారి అజెండాలో ముఖ్యమైన సామాజిక అసమానతలు, దోపిడీ, దౌర్జన్యాలు, పౌరహక్కులు, గిరిజన సమస్యలు లాంటి వాటిని పరిష్కరించడం ద్వారా మావోలను, వారి సిద్ధాంతాలను ప్రభుత్వం గెలవవచ్చు. వ్యక్తులను మట్టుపెట్టడం తాత్కాలికమే. వారి సిద్ధాంతాన్ని తమదైన ఆచరణ ద్వారా గెలిచి చూపవచ్చు. మావోలు కూడా ప్రజల్లో చైతన్యం లేకుండా కొంతమందితోనే బలమైన రాజ్యం మీద పైచేయి సాధించడం అసాధ్యమని గ్రహించాలి. ఏది ఏమైనా ఈ ఎన్‌కౌంటర్లకు తెరదించాలి. తుపాకులు కాకుండా మనుషులే మాట్లాడుకునే సుహృద్భావ వాతావరణం ఏర్పడాలి. ఇన్నాళ్లు తుపాకీ మోతలతో, బుల్లెట్ల వర్షంతో దండకారణ్యం దద్దరిల్లింది. రక్తపుటేరులు పారాయి. జరిగిన రక్తపాతం ఇక చాలు. దానికి స్వస్తి చెప్పాల్సిన తరుణమిదే. ‘అహింస ఒక ఆశయమే కానీ ఆయుధం కాదు; ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాదు’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఒక ప్రజా స్వామిక వాతావరణంలో రాజ్యానికి, మావోయిస్టులకు చర్చలు జరిగి ఆ మహాకవి ఆశ నిజం కావాలని కోరుకుందాం.
– శ్రీశ్రీ కుమార్
9440354092