అంతర్జాతీయ మానవ హక్కుల దినంకు సరిగ్గా వారం రోజులముందు భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రోటోకాల్ నిబంధనలను పక్కనపెట్టి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయంకు వెళ్లి ఎదురేగి ‘రెడ్ కార్పెట్’ స్వాగతం పలికారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యంకు మాతృక, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న భారత్ ఇటీవల కాలంలో మానవహక్కుల ప్రమాణాలలో ప్రజలు సిగ్గుచేటుతో తలవంచుకొని పరిస్థితులు నెలకొంటున్నాయి. పుతిన్ తెలివైన రాజకీయ నాయకుడే కాకుండా ప్రపంచంలోనే నేడు అతి కిరాతకమైన నియంత. గత మూడేళ్ళుగా ఉక్రెయిన్‌పై అక్రమంగా యుద్ధానికి ఉపక్రమించి, యుద్ధంకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ఎంత దారుణంగా ఊచకోత కోస్తున్నారో చూస్తున్నాం. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను ఏవిధంగా అణచివేస్తున్నారో చూస్తున్నాం.కేవలం మోడీ ప్రభుత్వమే కాకుండా భారతీయ మీడియా సైతం ఆయనను పొగడ్తలతో నింపే ప్రయత్నం చేసింది.
ఈ సందర్భంగా ఆయనతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ మీడియా సంస్థ జైలులో విషప్రయోగంతో చనిపోయిన ఆయన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణం గురించి ఒక్క ప్రశ్న వేసే సాహసం చేయలేదు. పుతిన్ పర్యటన చివరిలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఉక్రెయిన్‌ను ‘వివాదం’గా పేర్కొన్నారు గాని ‘యుద్ధం’, ‘సంఘర్షణ’ అనే పదాలు వాడేందుకు భారత్ సాహసింపకపోవడం విస్మయం కలిగిస్తోంది. కొద్దీ నెలల క్రితం విడుదలైన ప్రపంచ చిత్రహింసల సూచిక 2025లో భారతదేశం ‘అధిక ప్రమాదం’ కలిగిన దేశంగా ర్యాంక్ పొందింది. ఇది 200కి పైగా పౌర సమాజ సంస్థల సహకారంతో చిత్రహింసలకు వ్యతిరేకంగా ప్రపంచ సంస్థ (ఒఎంసిటి) రూపొందించిన మొట్టమొదటి వార్షిక అంచనా. 2024లో, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి)నివేదిక ప్రకారం దేశంలో 2,739 నిర్బంధంలో మరణాలు జరిగాయి. ఇవి 2023లో జరిగిన 2,400 కేసుల నుండి బాగా పెరిగిందని నివేదిక పేర్కొంది.
లిబియా, హోండురాస్, బెలారస్, కొలంబియా, టర్కీ, ఫిలిప్పీన్స్, ట్యునీషియాలతో పాటు భారతదేశం బాధితులు, రక్షకులపై క్రమబద్ధమైన హింస, ప్రతీకార చర్యలకు అధిక ప్రమాదం ఉన్న దేశాలుగా తాజా సూచిక గుర్తించింది. ఈ గణాంకాలు ఉన్నప్పటికీ, భారతదేశంలో హింస లేదా సిఐడిటిపి (క్రూరమైన, అమానుషమైన లేదా అవమానకరమైన చికిత్స లేదా శిక్ష)ను ప్రత్యేకంగా నేరంగా పరిగణించే జాతీయ చట్టం లేదు. హింసను ఎదుర్కోవడానికి రాజకీయ నిబద్ధతను గణనీయమైన ప్రమాదంగా రేట్ చేశారు. అయితే నిర్బంధంలో హింస నుండి స్వేచ్ఛ, శిక్షార్హతను అంతం చేయడం, బాధితుల హక్కులు, పౌర స్థలంతోసహా అన్ని ఇతర స్తంభాలు అధిక ప్రమాదం స్కోరును పొందాయి. మరోవంక, స్వతంత్రంగా పనిచేయలేక పోవడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొందని కూడా నివేదిక పేర్కొంది. మార్చి 2025లో, గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్‌స్టిట్యూషన్స్ (జిఎఎన్‌హెచ్‌ఆర్‌ఐ) జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ‘ఏ’ నుండి ‘బి’ హోదాకు తగ్గించడం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంకు అంతర్జాతీయంగా అవమానకరమైన అంశం. దీనివల్లనే అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో అధికారిక హోదాను కోల్పోయాం.
దర్యాప్తులలో పోలీసుల ఉనికి, తగ్గిపోతున్న పౌర స్థలం, మానవ హక్కుల పరిరక్షకులుపై హింసను పరిష్కరించడంలో వైఫల్యాన్ని పేర్కొంటూ. హింస, అరెస్టులు లేదా జైలు మరణాలకు సంబంధించిన డేటా ప్రజలకు పరిమితంగా అందుబాటులో ఉండటం వల్ల, పారదర్శకతపై భారతదేశపు స్కోరు ‘దాగి ఉంది’ అని గుర్తించారు. ‘బాధితుల హక్కులు తీవ్రంగా పరిమితంగా ఉన్నాయి’ అని నివేదిక పేర్కొంది. ‘హింస బాధితులను నిర్వచించే సమగ్ర చట్టం లేకపోవడంతో చాలా మంది బాధితులకు పరిష్కారం లేదా పునరావాసం లేదు. ‘విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం (ఎఫ్‌సిఆర్‌ఐ), 2010 కింద 30,000 కంటే ఎక్కువ ఎన్‌జిఒలు మూతబడ్డాయి. ఆదాయపన్ను నియమాలు 2021 వంటి చట్టాలు పౌర సమాజాన్ని అణచివేస్తూనే ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఈ ధోరణులు ఉన్నప్పటికీ, కొన్ని సానుకూల పరిణామాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2020లో, సుప్రీం కోర్టు పోలీస్ స్టేషన్లలో 24 గంటలూ సిసిటివిలను మోహరించాలని ఆదేశించింది. అయితే, ఈ నిర్ణయం ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదు. భారతదేశంలో, భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), క్రిమినల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్ (సిఆర్‌పిసి), భారతీయ సాక్ష్య చట్టంల స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య బిల్లు (బిఎస్బి) వంటి కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు. ఇవి గతంలోని చట్టాలలో గల లోపాలను మెరుగుపరిచే బదులు చట్టపరమైన తిరోగమనం కూడా మానవ హక్కుల సమాజం గుర్తించింది. ఈ చట్టాలు కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టిన్నప్పటికీ, అవి పోలీసు కస్టడీ వ్యవధిని కూడా పొడిగించాయి.
ప్రభుత్వ అధికారులను విచారించడానికి కార్యనిర్వాహక అనుమతి అవసరమని పేర్కొన్నది. గణనీయమైన చట్టపరమైన, సంస్థాగత లోపాల కారణంగా భారతదేశంలో శిక్షార్హత లేకపోవడం లోతుగా పాతుకుపోయిందని అంతర్జాతీయ నివేదికలు స్ఫష్టం చేస్తున్నాయి. భారతదేశంలో మానవ హక్కుల ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అవసరమైన వ్యవస్థాగత మార్పులు కనిపించడం లేదు. ఈ సందర్భంగా గ్లోబల్ టార్చర్ ఇండెక్స్ భారతదేశానికి పది అంశాల సిఫార్సు చేసింది. యుఎన్ క్యాట్‌ను ఆమోదించడం, సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఎఎఫ్‌ఎస్ పిఎ), ఎఫ్‌సిఆర్‌ఎలను రద్దు చేయడం, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం, నిర్బంధ పరిస్థితులు మండేలా, బ్యాంకాక్ నియమాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి. మండేలా, బ్యాంకాక్ నియమాలు ఖైదీల చికిత్సకు కనీస మార్గదర్శకాలను నిర్దేశించే ఐరాస ప్రమాణాలు. మండేలా నియమాలు అందరు ఖైదీలకు వర్తిస్తుండగా, బ్యాంకాక్ నియమాలు ప్రత్యేకంగా మహిళా ఖైదీలు, నేరస్థుల అవసరాలను పరిష్కరిస్తాయి. యుఎపిఎ నిబంధనల దుర్వినియోగాన్ని ఆపివేసి, మానవ హక్కుల పరిరక్షకులను రక్షించడానికి సమగ్ర చట్టాన్ని రూపొందించాలని కూడా ఇది ప్రభుత్వాన్ని కోరింది. ‘జాతీయ భద్రతా చట్టాల దుర్వినియోగం, పేలవమైన నిర్బంధ పరిస్థితులు, పరిష్కారానికి ప్రాప్యత లేకపోవడం వల్ల భారతదేశంలో హింస నుండి బయటపడిన వారిలో ఎక్కువ మందికి న్యాయం లేకుండాపోతుంది’ అని నివేదిక ముగించింది.
హింస, నిర్బంధంలో మరణాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై కీలకమైన డేటాను యాక్సెస్ చేయడంలో పౌరసమాజం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్లను నొక్కి చెబుతుంది. ‘ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనం నిర్ధారించడానికి, చట్టంలో, ఆచరణలో ప్రతి సమాజంలో డేటా యాక్సెస్‌కు హామీ ఇవ్వాలి’ అని అది పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు, పోలీసు ప్రోటోకాల్‌లు, నిర్బంధ గణాంకాలపై అధికారిక డేటా పేలవమైన లభ్యత ‘దేశంలోని సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో సవాళ్లను ప్రతిబింబిస్తుంది’. వ్యవస్థాగత దుర్వినియోగాన్ని పర్యవేక్షించడానికి, పరిష్కరించడానికి సంస్థలు, వ్యక్తుల సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది.
వాస్తవానికి భారత దేశంలో ఉన్నన్ని మానవ హక్కుల సంస్థలు మరో దేశంలో లేవు. జాతీయ స్థాయిలోనే 9 హక్కుల కమిషన్లు ఉండగా, రాష్ట్రాలలో మరిన్ని ఉన్నాయి. మొత్తం మీద 180 వరకు ఉన్నాయి. అయితే, అవ్వన్నీ ఐరాస ప్రమాణాలకు విరుద్ధంగా ‘రాజకీయ పునరావాసం’ మాదిరిగా రిటైర్డ్ న్యాయమూర్తులు, అధికారులకు ప్రయోజనకర ఉపాధి కల్పించే సంస్థలుగా మారిపోతున్నాయి. దానితో వాటి నిజాయితీ, చిత్తశుద్ధి, స్వతంత్రతలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఇన్ని మానవ హక్కుల సంస్థలు ఉన్న ఏకైక దేశం మనది. అయినప్పటికీ అవి పనిచేయడం లేదు’ అని పీపుల్స్ వాచ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రీ టిఫాగ్నే ఆవేదన వ్యక్తం చేశారు. ‘జాతీయ మానవ హక్కుల కమిషన్ 32 సంవత్సరాలుగా ఉనికిలో ఉంది. చట్టవిరుద్ధ హత్యలు లేదా హింసకు కారణమైన ఒక్క పోలీసు అధికారిని కూడా విచారించలేదు’ అని ఆయన గుర్తు చేశారు. హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి సదస్సును ఆమోదించడంలో విఫలమైనందుకు, కస్టడీ మరణాలలో దాని ‘సున్నా జవాబుదారీతనం’ కోసం భారతదేశం ‘సిగ్గుతో నమస్కరించాలి’ అని ఆయన స్పష్టం చేశారు. శిక్ష విధించకపోవడం, అణచివేత, న్యాయవాదులను చట్టపరంగా లక్ష్యంగా చేసుకోవడం ద్వారా గుర్తించిన విస్తృత మానవ హక్కుల సంక్షోభం గురించి కూడా హెన్రీ హెచ్చరించారు.
చలసాని నరేంద్ర
98495 69050