సంక్రాంతి పండుగ నాటికి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు రూ. 5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని సిరిసిల్ల శాసన సభ్యుడు, మాజీ మంత్రి,బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు. బుధవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఆటో కార్మికులకు ఆత్మీయ భరోసా కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్లు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పంపిణీ చేశారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ అబద్దపు హమీలతో అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకం వల్ల 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ 162 మంది ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.లు 10 లక్షలు నష్టపరిహరం అందించాలన్నారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించకపోతే వచ్చే ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో మహ ధర్నా చేపడతామన్నారు. ఆటో కార్మికులు క్రెడిట్ సొసైటీలుగా ఏర్పడి మైక్రో రుణాలు పొంది జీవనోపాధి పెంచుకోవాలన్నారు.మార్పు మార్పు అంటూ రాహుల్‌గాంధీ,
రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు అన్ని వర్గాల ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యిందని కాంగ్రెస్ పార్టీ మోసాలు ప్రజలు అర్ధం చేసుకుని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా కెసిఆర్‌ను ఎప్పుడు సిఎం చేద్దామా అని ఎదిరి చూస్తున్నారన్నారు. 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 50 వేల కోట్ల రూపాయలకు బదులుగా 12 వేల కోట్లు మాఫీ చేసి అందరికి మాఫీ అయ్యిందంటున్నారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెపుతున్నారని, రెండున్నల లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంకు కోటి కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తాయి ఎప్పుడు మహిళలను కోటీశ్వరులను చేస్తారని నిలదీశారు.ఆటో వాలాలను బిఆర్‌ఎస్ పాలనలో డ్రైవర్ టు ఓనర్ పథకంలో యజమానులుగా చేయాలని చూస్తే కాంగ్రెస్ పాలనతో ఓనర్ టు డ్రైవర్ పథకంగా మారిపోయిందని మార్పుమార్పు అంటే ఇదేనేమో అన్నారు.ఇటీవల జూబ్లీహిల్ ఎన్నికల్లో గతంలో బిఆర్‌ఎస్ పాలనలో రాహుల్ గాంధీ ఎక్కిన శుశ్రుత్ అలీ ఓనర్‌గా ఉన్న ఆటోను తానూ ఎక్కానని అప్పుడు ఓనర్‌గా ఉన్న శుశ్రుత్ అలీ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో డ్రైవర్‌గా మారానని వాపోయాడని కెటిఆర్ అన్నారు. కెసిఆర్, కెటిఆర్ ఇద్దరి ఉద్యోగాలు ఊడ గొడితే యువతకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఇప్పటి వరకు ఆరేడు వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.
బిఆర్‌ఎస్ ఇచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలు అందిస్తున్నారన్నారు.గత రెండేళ్లుగా నాలుగు లక్షల ఉద్యోగాలు బాకీ పడ్డారన్నారు. ఆటో వాలాలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని రెండేళ్లలో ప్రతి ఆటోకు 24 వేలు, మొత్తంగా 1560 కోట్ల రూపాయలు బకాయ పడ్డారన్నారు.ఈ కార్యక్రమంలో నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, బిఆర్‌ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ ఇంచార్జీ చల్మెడ లక్ష్మీకాంతరావు,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ జడ్‌పిసిపిలు తుల ఉమ, న్యాలకొండ అరుణ, సిరిసిల్ల పట్టణ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి,బిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, బిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఆకునూరి శంకరయ్య, బొల్లి రామ్మోహన్, వెంగళ శ్రీనివాస్, కుంభాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.