ముసాయిదాలో మార్పులు, చేర్పులపై నివేదిక సిద్దం
అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల
మన తెలంగాణ/హైదరాబాద్ :
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకురానున్న విత్తన చట్టం రైతుల శ్రేయస్సుకు బాటలు వేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం విత్తన ముసాయిదా చట్టం -2025 పై అభ్యంతరాలు డిసెంబర్ 11వ తేదీ వరకు తెలపాలని కోరడంతో, బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి తుది నివేదిక రూపకల్పనలో చేర్చాల్సిన, చట్టంలో మార్చాల్సిన అంశాలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి రైతుల సహకారం ముఖ్యమైనదని, విత్తన రైతులు తరచుగా అధికారిక గుర్తింపు లేకపోవడం, లోపభూయిష్ట ఒప్పంద నిబంధనలు, సరైన పరిహారం అందకపోవడం వంటి ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నారని మంత్రి చెప్పారు. గత పదేళ్ళ కాలంలో విత్తనోత్పత్తి సమస్యలతో పాటు, పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు పండించే రైతులు నకిలీ, నాసిరకం, అనుమతి లేని, అధిక ధర కలిగిన విత్తనాల వ్యాప్తి కారణంగా నష్టాలను చవి చూశారని తెలిపారు. నాణ్యత లేని హైబ్రిడ్, బిటి విత్తనాల లభ్యత, విత్తనాలు, ఇన్‌పుట్ ఖర్చులు బాగా పెరగడంతో కలిపి సాగు ఖర్చు గణనీయంగా పెరిగిందన్నారు. దీంతో వ్యవసాయ కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేసిందన్నారు.
విత్తనచట్టం, 1966 తరువాత ప్రభుత్వం తీసుకొచ్చిన 2004, 2010, 2019 నాటి విత్తన బిల్లు ముసాయిదాలో అనేక నిబంధనలు ఉన్నప్పటికి, రైతుల ప్రయోజనాలను, హక్కులను పరిరక్షించడంలో ప్రభావవంతమైన చట్టాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులు, వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని కఠిన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా కేంద్రాన్ని చట్టాల మార్పుల కోసం విజ్ఙప్తి చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ దశలో గత నెలలో కేంద్ర ప్రభుత్వం విత్తన బిల్లు ముసాయిదా 2025ని తీసుకోచ్చిందని, అందులో పలు సవరణలు సూచించనట్లు మంత్రి చెప్పారు.
నకిలీ, నాణ్యత లేని విత్తనాలతో నష్టపోయే రైతులకు చట్టబద్ధమైన, కాలపరిమితితో కూడిన పరిహార విధానాన్ని ఏర్పాటు చేయడానికి బిల్లులో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రవేశపెట్టి, సాధారణ పరిస్థితుల్లో రైతు పొందగలిగే అత్యధిక దిగుబడి ఆధారంగా పరిహారం లెక్కించాలని మంత్రి సూచించారు. రైతు ఫిర్యాదు చేసిన 60 రోజుల్లోపు క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసి పరిష్కరించాలన్నారు. విత్తనోత్పత్తి చేసే రైతులను రక్షించడానికి ముసాయిదా విత్తన బిల్లులో ఒక ప్రత్యేక విభాగాన్ని చేర్చాలని, విత్తనాలను సరసమైన ధరలలో రైతులకు అందించడానికి విత్తన ధరల నియంత్రణ తప్పనిసరి చట్టబద్ధమైన నిబంధనగా ఉండాలి. సాంప్రదాయ విత్తనాలు, వారసత్వ విత్తన రకాలను, వాటి డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్‌ను రక్షించడానికి ప్రత్యేక చర్యలు ఉండాలన్నారు. విత్తన కంపెనీలకు లైసెన్స్ లు జారీ చేయడానికి ప్రత్యేకమైన మార్గదర్శకాలు రూపొందించాలని, అందులో లైసెన్సింగ్ కమిటీ కూర్పు, పరిశోధన అవసరాలు, విద్యార్హతలు, రకాల నమోదు కోసం బఫర్ వ్యవధి వంటి అంశాలను జోడించాలని మంత్రి పేర్కొన్నారు. ఈ అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విత్తన చట్టంలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కొరినట్టు మంత్రి తెలియజేశారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.
ముసాయిదా చట్టం 2025 లోని నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సవరణలు:
-సెక్షన్ 13 లోని నిబంధన: ఏదైనా వ్యవసాయ విత్తనాన్ని రైతులకు అమ్మకానికి విడుదల చేసే ముందు, కేంద్ర విత్తన కమిటీతో ముందస్తు నమోదు తప్పనిసరి.
సూచించిన సవరణ: రాష్ట్ర విత్తన కమిటీకి, రాష్ట్రానికి ప్రత్యేకమైన రకాలను నమోదు చేయడానికి అధికారం ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రం తన రైతులకు విత్తన రకాల అనుకూలత, అవసరాల గురించి బాగా తెలుసు.
సెక్షన్17(3)లోని నిబంధన: ఉత్పత్తిదారు లేదా ప్రాసెసింగ్ ప్లాంట్ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోకపోతే ఉత్పత్తిదారు, విత్తన ఉత్పత్తి సంస్థ లేదా విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు విత్తనాన్ని విక్రయించకూడదు లేదా పంపిణీ చేయకూడదు.
సూచించిన సవరణ: ప్రతి విత్తన ఉత్పత్తి సంస్థ నిర్వాహకుడు వ్యవసాయంలో డిగ్రీ లేదా డిప్లొమా కనీస విద్యార్హతను కలిగి ఉండాలి లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో కనీసం మూడు నెలల సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేసి ఉండాలి.
-సెక్షన్18(1)లోని నిబంధన: విత్తన డీలర్లు, పంపిణీదారులు విత్తన అమ్మకాలను ప్రారంభించే ముందు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి.
సూచించిన సవరణ: విత్తన డీలర్లు, పంపిణీదారులు రిజిస్ట్రేషన్‌కు అర్హత సాధించడానికి వ్యవసాయంలో డిగ్రీ లేదా డిప్లొమా లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి విత్తనోత్పత్తిలో సర్టిఫికేట్ కోర్సు యొక్క కనీస విద్యా అర్హతను కూడా కలిగి ఉండాలి.
సెక్షన్21(1d)లో నిబంధన: ఏదైనా నమోదిత రకం విత్తనాన్ని అమ్మకానికి ఉంచినప్పుడు, అది కేంద్ర కనీస విత్తన ధృవీకరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఉత్పత్తిదారుడు కంటైనర్‌పై విత్తన ప్రమాణాలను స్పష్టంగా ప్రదర్శించాలి, కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ద్వారా జారీ చేయబడిన క్యూఆర్ కోడ్‌ను చేర్చాలి. ఈ క్యూర్ కోడ్ విత్తనం అధీకృత ధృవీకరణ సంస్థ ద్వారా ధృవీకరించబడిందా లేదా ఉత్పత్తిదారుచే స్వీయ ధృవీకరించబడిందా అనే దాని గురించి సమాచారాన్ని అందిస్తుంది.
సూచించిన సవరణ: ప్రస్తుత ముసాయిదా చట్టం ప్రకారం విత్తన ఉత్పత్తి సంస్థల స్వీయ-ధృవీకరణ అనుమతి నిబంధన ఉంది. స్వీయ- ధృవీకరణ కారణంగా రైతుల పొలాల్లో విత్తన వైఫల్యం గురించి అనేక ఫిర్యాదులు తలెత్తాయి. అందువల్ల, మార్కెటింగ్ కోసం ఉద్దేశించిన అన్ని విత్తనాలు గుర్తింపు పొందిన ధృవీకరణ సంస్థ ద్వారా ధృవీకరించాలి, స్వీయ-ధృవీకరణను అనుమతించకూడదు.
సెక్షన్ 22లోని నిబంధన: అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విత్తనాల ధరలను నియంత్రించవచ్చు.
సూచించిన సవరణ: రైతుల ఫిర్యాదులు తలెత్తినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు విత్తన ధరలను నియంత్రించే అధికారం కల్పించాలి. రాష్ట్ర విత్తన కమిటీ విత్తన ధరలను సమీక్షించి, హేతుబద్ధమయిన ధరల పరిమితిని సిఫార్సు చేయడానికి అనుమతించాలి.
-సెక్షన్ 33 లో నిబంధన: ఎగుమతి చేసే దేశంలో నిర్వహించబడే వివిధ ప్రదేశాల పరీక్షల ఆధారంగా విత్తనాల దిగుమతికి అనుమతి ఉంది.
సూచించిన సవరణ: స్థానిక అనుకూలతను పరీక్షించకపోతే దిగుమతి చేసుకున్న విత్తనాలు భారతీయ వ్యవసాయ-వాతావరణ పరిస్థితులలో వైఫల్యం చెందవచ్చు. దీనివల్ల పంట నష్టాలు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల దిగుమతి చేసుకున్న విత్తనాలన్నింటికీ కనీసం రెండు సంవత్సరాలు ఐసిఏఆర్ లేదా ఎస్‌ఏయు కేంద్రాలలో బహుళ-స్థాన పరీక్షలను తప్పనిసరి చేయాలి.
-సెక్షన్34లోని నిబంధన: రిజిస్ట్రేషన్ లేకుండా విత్తనాల అమ్మకం, నకిలీ లేదా నాసిరకం విత్తనాల సరఫరా లేదా సరైన లేబులింగ్ లేకుండా విత్తనాల అమ్మకం వంటి వాటికి పాల్పడితే రూ. 50,000 నుండి రూ. 30 లక్షల వరకు జరిమానాతో పాటు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష.
సూచించిన సవరణ: ఉత్పత్తి సంస్థలు చేసిన నేరాలకు పైన పేర్కొన్న జరిమానాలు, శిక్షలతో పాటు, విత్తన ఉత్పత్తిదారు లేదా కంపెనీని కనీసం ఐదు సంవత్సరాల పాటు విత్తన ఉత్పత్తి, అమ్మకాల నుండి నిషేధించాలి.