దేశంలో మహిళలందరికీ న్యాయం జరగాలంటే మహిళా రిజర్వేషన్లలో బిసి మహిళలకు సబ్ కోట ఉండాల్సిందేనని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అప్పుడే మహిళలకు సాధికారికత లభిస్తుందని ఆయనన్నారు. బిసి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 15న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బిసి మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి నేతృత్వంలో బిసి మహిళల ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్ రామ్ నగర్ లో దత్తాత్రేయ తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఈనెల 15న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నా వాల్ పోస్టర్ ను దత్తాత్రేయ ఆవిష్కరించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ జనాభాలో సగ భాగం ఉన్న మహిళలకు అన్ని రంగాలలో సమ న్యాయం జరగాలని అందులో వెనుకబడిన
బిసి మహిళలకు కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని ఆయనన్నారు. బిసి మహిళలకు ప్రధాని నరేంద్ర మోడీ సబ్ కోట కల్పిస్తారనే విశ్వాసం తనకుందన్నారు . బిసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల సాధన కోసం బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈనెల 15న ఢిల్లీలో బిసి రిజర్వేషన్ల ధర్నా కార్యక్రమం నిర్వహి స్తున్నామన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా జరిగే ఈ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వందలాది గా తరలి రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి మహిళ నేతలు తారకేశ్వరీ, సంధ్యారాణి, శ్యామల గౌతమి, శైలజ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.