ఉ.7 గంటలకు పోలింగ్ ప్రారంభం
ఎక్కడున్నా ఓటర్లందరూ తమ ఓటు
హక్కు వినియోగించుకోవాలని అధికారుల విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గురువారం(డిసెంబర్ 11) మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 7.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనుండగా, మధ్యాహ్నం 2 తర్వాత ఓట్ల లెక్కింపుతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు ఎక్కడున్నా సొంతూరులో ఓటు హక్కు ఉంటే తప్పకుండా వెళ్లి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. పల్లె ప్రగతికి బాధ్యతగా ఓటేయాలని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి సామర్థ్యాలున్న నాయకుడిని ఎంచుకోవాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో అందరూ ఇవిఎంలలో ఓటే వేస్తుండగా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ ఓటింగ్ ఉంటుంది. నచ్చిన అభ్యర్థి గుర్తుపై స్వస్తిక్ ముద్ర వేస్తే మీ ఓటు వారికి పడ్డట్లే. తెలిసీ తెలియక లేదా ఏమరుపాటుతో ముద్ర సరిగ్గా పడకపోయినా, ఇద్దరు అభ్యర్థుల మధ్య అటూ ఇటూ కాకుండా ముద్ర పడితే మీ ఓటు మాత్రం చెల్లుబాటు కాదు. ఖాళీ బ్యాలెట్ వేసినా అది చెల్లుబాటు కాదు. బ్యాలెట్‌లోని అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటా గుర్తుపై కూడా ఓటు వేయొచ్చు.
సమాచారం అందిస్తున్న అభ్యర్థులు
ఇప్పటికే సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు తమ బంధువులు, స్నేహితులు, మద్దతుదారులకు ఫోన్లు చేస్తున్నారు. ఓటేయడానికి తప్పకుండా రావాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటర్ల జాబితాలు చేతపట్టుకుని వీరంతా ఎక్కడున్నారో తెలుసుకుంటున్నారు. వారి అడ్రస్, ఫోన్ నెంబర్లు కనుక్కుంటున్నారు. బస్ ఛార్జీలతో పాటు కూలీ పనులకు వెళ్లేవారికి ఎలాంటి నష్టం కాకుండా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు.
మూడు దశల్లో పోలింగ్..
రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ గురువారం(డిసెంబర్ 11) జరుగుతుండగా.. రెండో దశ ఈనెల 14న, మూడో దశ ఈనెల 17వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.