వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి పేరుతో హైదరాబాద్‌కు వచ్చి గంజాయి అమ్మకాల ముఠాగా ఏర్పడి గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్న గంజాయి అమ్మకాల గుట్టును రాష్ట్ర ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్‌టీమ్ రట్టు చేసింది. దీనికి సంబధించిన వివరాలు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నిత్యవసర సరుకులను ఇంటింటికి చేరవేసే బ్లింకెట్ డెలీవరీ బాయ్స్ గా ఉద్యోగం చేస్తూ మరో పక్కా అవసరమున్న వారికి గంజాయి రవాణ చేస్తు సొమ్ము చేసుకుంటున్న అంతరాష్ట్ర గంజాయి అమ్మకం ముఠాను ఎస్టిఎఫ్‌ఏ టీమ్ అంజిరెడ్డి బుధవారం పట్టుకున్నారన్నారు. ఒరిస్సా, ఖమ్మం, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు పది మంది ఉపాధి కోసం వచ్చారని, వీరంత కలిసి హోటల్, సర్వీస్ అపార్ట్‌మెంట్‌ల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న క్రమంలో పరసర్పరం పరిచయం ఏర్పడిందని తెలిపారు. అందరికీ గంజాయి అలవాటు ఉండటం, గంజాయి అమ్మకందార్ల వద్ద గంజాయి కొనుగోలు చేసేవారన్నారు.
ఈ నేపథ్యంలో గంజాయి అమ్మేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఆయన చెప్పారు. బీదర్, ఒరిస్సా నుంచి తక్కువ ధరలకు గంజాయిని కొనుగోలు చేసుకొని మాదాపూర్, బంజారా హిల్స్‌తో పలు ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు సాగిస్తు వచ్చిన లాభాలను పంచుకునేవారని వివరించారు. ఈ క్రమంలో గంజాయి అమ్మకందార్లుగా చెలమణి అవుతుండటం కష్టమని భావించి డెలివరీ బాయ్స్, హోటళ్లలో పని చేస్తూ గంజాయి అమ్మకాలు చేపడుతున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. నిందితుల వద్ద నుంచి 3.3 కేజీల గంజాయితోపాటు 6 సెల్‌ఫోన్లను, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు శ్రీకాంత్ (కర్ణాటక), కిశోర్ (మణికొండ), ఉమెష్ కుమార్ (ఒరిస్సా), సయ్యద్ అన్వర్ (ఖమ్మం), సింహచలరావు (ఒరిస్సా), అమర్ (కర్ణాటక) జోయ అలీ (కర్ణాటక), మహ్మమద్ అలీ (కర్ణాటక), ఇర్ఫాన్ (కర్ణాటక), బాబుల్‌పురి (కర్ణాటక)లపై కేసు నమోదు చేశామని వీరిలో ఆరుగురిని అరెస్టు చేశామన్నారు.
డెలీవరి కంపెనీలకు ఎన్‌ఫోర్స్ మెంట్ లేఖలు
డెలీవరీ బాయ్స్ ముసుగులో గంజాయి, డ్రగ్స్, గంజాయి అమ్మకాలు జరపడం నేరంగా పరిగణించబడుతుందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం అన్నారు. నిత్యవసర సరుకులను ఇంటింటికి సరఫరా చేసే బాయ్స్ గంజాయి అమ్మకాలు చేపట్టడాన్ని బయట పెట్టిన ఎస్టీఎప్ ఏ టీమ్ అంజిరెడ్డి, సిబ్బందిని డైరెక్టర్ అభినిందించారు. బ్లింకిట్ సరుకుల డెలీవరీ కంపెనీతోపాటు ఇతర పదార్థాలను సరఫరా చేసే కంపెనీలకు లేఖలు రాయాలని అధికారులను అదేశించారు. చేస్తున్న వృత్తి ముసుగులో గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని డైరక్టర్ సూచించారు. డెలీవరీ కంపెనీలు వారి సర్వీస్ బాయ్స్ వద్ద గంజాయి, డ్రగ్స్ లభిస్తే చాల కఠినంగా నిర్ణయాలు ఉంటాయని డైరెక్టర్ హెచ్చరించారు.