తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో కల్తీ నెయ్యి, పరకామణి వివాదాలు చల్లారకముందే మరో కుంభకోణం వెలుగు చూసింది. ఈ మారు పట్టువస్త్రాల (శాలువాల) కొనుగోళ్లలో ఈ స్కాం జరిగింది. సిల్స్ శాలువాలకు బదులుగా పాలిస్టల్ శాలువాలు సరఫరా చేసి అక్రమార్కులు ఏకంగా రూ.54 కోట్లు కొట్టేసినట్లు సమాచారం. దీంతో మరోసారి టిటిడి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. 2015 నుండి 2025 వరకు పదేళ్ల పాటు ఇలా సిల్క్ శాలువాల స్ధానంలో పాలిస్టర్ శాలువాల సరఫరా మోసం జరిగిందని, స్వచ్ఛమైన మల్బరీ పట్టుకు బదులు పాలిస్టర్ శాలువలు సరఫరాలు చేసినట్లు టిటిడి అంతర్గత నిఘా విచారణలో వెల్లడైంది. టిటిడి బోర్డు ఛైర్మన్ బిఆర్ నాయుడు దీనిపై ఆందోళన వ్యక్తం చేయడంతో విజిలెన్స్ విచారణ మొదలైంది. కాంట్రాక్టర్ టెండర్లలో పేర్కొన్న మల్బరీ పట్టు స్థానంలో చౌకైన పాలిస్టర్ వస్త్రాన్ని సరఫరా చేసినట్లు ఈ విచారణలో నిర్ధారించారు. ఈ అక్రమాల కారణంగా టిటిడి బోర్డుకు రూ.54 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ శాలువలను ప్రముఖ దాతలకు బహుమతులుగా వేదాశీర్వచనం వంటి ఆలయ కార్యక్రమాలలో ఇస్తున్నారు. సుమారు రూ.350 విలువైన శాలువాను రూ.1,300కు బిల్ చేశారని, ఇలా మొత్తం అక్రమాల విలువ రూ.50 కోట్లకు పైన ఉంటుందని అంచనా.దీనిపై ఎసిబి విచారణ కోరినట్లు టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. టిటిడి అధికారులు శాలువాల శాస్త్రీయ విశ్లేషణ కోసం వీటి నమూనాల ను కేంద్రీయ పట్టు పరిశోధన మండలి (సీఎస్‌బీ)తో పాటు మరో ప్రయోగశాలకు పంపగా..అవి పాలిస్టర్ వస్త్రంగా తేలింది.ఇది టెండర్ నిబంధ నల స్పష్టమైన ఉల్లంఘనే. అసలైన పట్టు ఉత్పత్తులకు ఉండాల్సిన సిల్క్ హోలోగ్రామ్ కూడా సరఫరా చేసిన నమూనాలలో లేదు. దీంతో ఇలా శాలువా వస్త్రం మార్చి సరఫరా చేసిన సంస్థపై విచారణ జరగబోతోంది. విజిలెన్స్ నివేదికపై తక్షణమే స్పందించిన టిటిడి ట్రస్ట్ బోర్డు సంబంధిత సంస్థతో ఉన్న అన్ని ప్రస్తుత టెండర్లను రద్దు చేసింది. పూర్తి స్థాయి నేర పరిశోధన నిమిత్తం ఈ కేసును ఎసిబికి అప్పగించారని తెలుస్తోంది.
ఇప్పటికే లడ్డూ కల్తీ వ్యవహారంతో టిటిడి ప్రతిష్ఠ మసకబారింది. ఆ తర్వాత పరకామణి చోరీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. వీటిపై విచారణ జరుపుతుంటగానే ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారి శవమై తేలారు. దీంతో తిరుమలలో ఏం జరుగుతుంద న్న చర్చ సామాన్య భక్తుల్లో షురూ అయ్యింది. తిరుమలలో జరిగిన పట్టు వస్త్రాల స్కాంపై జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. టిటిడిలో ఎన్నో అక్రమాలు వెలుగులోకి వస్తుండటానికి కారణం కూటమి ప్రభుత్వమే విచారణను వేగంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. హిం దూ మత విషయాలను చిన్నచూపు చూడటాన్ని పవన్ విమర్శించారు.