కర్నాటక అసెంబ్లీలో బుధవారం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక బిల్లు ప్రవేశపెట్టింది. విద్వేష ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లును ప్రతిపక్షం బిజెపి అభ్యంతరాల నడుమ తీసుకు వచ్చింది. ఎవరైనా విద్వేషపూరితంగా వ్యవహరించినట్లు తేలితే వారికి రూ లక్ష జరిమానా, పది సంవత్సరాల జైలుశిక్ష పడేలా ఈ చట్టం రూపొందించారు. ఈ నెల 4వ తేదీన జరిగిన మంత్రి మండలి సమావేశంలో సంబంధిత బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇప్పుడు దీనిని అసెంబ్లీలో హోం మంత్రి జి పరమేశ్వర ప్రవేశపెట్టారు. ఏదైనా ప్రసంగం ద్వారా ఎవరైనా తమ ప్రసంగాలు , రాతలు ,చివరికి చేతలు సంజ్ఞల ద్వారా అయినా లేదా దృశ్యపరమైన చిత్రాల ద్వారా, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా లేదా విద్వేషాలు రెచ్చగొడితే వారు ఈ బిల్లు ప్రకారం రూపొందే చట్టం మేరకు శిక్షార్హులు అవుతారు. ఎవరైనా వ్యక్తి మృతుడు అయినా సజీవుడు అయినా ఏ వర్గం ఏ బృందం లేదా ఏ మతానికి చెందిన వారిని అయినా కించపరిచే విధంగా మాట్లాడటం తద్వారా సామరస్య విచ్ఛిన్నత, విద్వేషాలు , వైరం కల్గించడం జరిగేలా చేసినట్లు అయితే, అది నిర్థారణ అయితే వారు శిక్షకు గురి కావల్సి ఉంటుంది. మతాలు, కులాలు, లింగం, సెక్స్‌పరమైన విషయాలను తీసుకుని ద్వేషపూరిత ప్రసంగాలకు దిగినట్లు తేలితే అందుకు పాల్పడ్డ వారు బిల్లు పరిధిలో విద్వేష ప్రసంగాలకు పాల్పడ్డ వ్యక్తులుగా నిర్థారణ అవుతారు. బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించే అవకాశం కల్పించాలని హోం మంత్రి ముందుగా స్పీకర్ యుటి ఉషాను అభ్యర్థించారు. అయితే దీనిని బిజెపి సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలకు దిగుతూ తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కర్నాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నియమావళి మేరకు బెల్గావిలో జరుగుతున్నాయి. బిల్లు తీసుకురావడానికి ముందే సభ్యుల నుంచి ఇందుకు మద్దతు ఉందా లేదా తెలుసుకోవల్సి ఉందని బిజెపి సభ్యులు సునీల్ కుమార్ వంటి వారు డిమాండ్ చేశారు. డివిజన్ ఆఫ్ ఓట్‌కు సూచించారు. కానీ స్పీకర్ పట్టించుకోకుండా బిల్లు సభలో ప్రవేశపెట్టడానికి తమ ఆమోదం తెలిపారు. బిల్లును ప్రవేశపెట్టిన తరువాత దీనిపై ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఈ బిల్లు ప్రభుత్వ అజెండాలో భాగం అని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కీలకం, ఇందుకు విద్వేష ప్రసంగాలకు అనుమతించేది లేదని, దీని కోసం అన్ని చర్యలు తీసుకుని తీరుతామని తెలిపారు. ఈ బిల్లు మేరకు శిక్షకు గురైన వారికి బెయిల్ రాదు. శిక్ష మినహాయింపు వీలు కాని పరిస్థితి ఉంటుంది. విద్వేష ప్రసంగాలకు ఎవరైనా వ్యక్తులు లేదా వర్గాలు పాల్పడే అవకాశం ఉందని అనుకుంటే కార్యనిర్వాహక మెజిస్ట్రేట్ లేదా ప్రత్యేక మెజిస్ట్రేట్ లేదా డిప్యూటి ఎస్‌పి ముందస్తు చర్యకు దిగేందుకు బిల్లు ద్వారా వీలేర్పడుతుంది. అయితే ఈ బిల్లులోని నిబందనలు బుక్స్‌కు , కరపత్రాలు, పేపర్స్, రచనలు, చిత్రాలు, పెయింటింగ్‌లు లేదా కార్టూన్లకు వర్తించవు. అయితే ఇవన్నీ కూడా సైన్స్, సాహిత్యం , కళలు లేదా నిర్థారిత హెరిటేజ్ లేదా మతపరమైన అంశాలకు సంబంధించిన ప్రయోజనాల కోణంలోనే ఉండాల్సి ఉంటుంది.