ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దాలన్నదే తన సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. “ఓయూలో ప్రజాప్రతినిధులను అడ్డుకునే చరిత్ర ఉంది.. మీరెందుకు వెళ్తున్నారని నన్ను కొందరు అడిగారు. మీరు చాలా ధైర్యం చేస్తున్నారని అన్నారు. నాది ధైర్యం కాదు, అభిమానం. నా తమ్ముళ్లు ఉన్న యూనివర్సిటీకి వెళ్లేందుకు ధైర్యం అవసరమా. గుండెల నిండా అభిమానం నింపుకుని.. భవిష్యత్ ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చా” అని అన్నారు.
దండకారణ్యంలో పుట్టిన కొమురంభీం చదువుకోలేదని.. ఆనాడు ఆధిపత్యం చెలాయించినవారిపై కొమురంభీం ఉద్యమాన్ని రగిలించారని సిఎం చెప్పారు. తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలు ఎదురు చూశామన్నారు. ఓయూలోనే తొలి దశ ఉద్యమం పుట్టిందని.. ఆ ఉద్యమం ఫలించక పోవడంతోనే విద్యార్థులు అటవి బాట పట్టారన్నారు. బడికి వెళ్లని అందెశ్రీ తెలంగాణ ఉద్యమ గేయాన్ని రచించారని ప్రశంసించారు. కాగా, ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.1000 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.