సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తెను ప్రేమించాడని ఇంజినీరింగ్ విద్యార్థి శ్రవణ్ సాయి అలియాస్ శివను ఆమె తల్లిదండ్రులు బ్యాట్లు, కత్తులతో కొట్టి చంపారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం, సృజన్ లక్ష్మీనగర్‌లో డిసెంబర్ 8 రాత్రి ఈ హత్య జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తల్లిదండ్రులతో పాటు బంధువులను అరెస్ట్ చేశారు. శ్రవణ సాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేసి కుటుంబానికి అందజేశారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… శ్రీజ, శ్రవణ సాయి ఇద్దరూ అమీన్‌పూర్‌లోని ఒకే స్కూల్‌లో 10వ తరగతి చదువారు. స్నేహం ప్రేమగా మారి, ఇంటర్, డిగ్రీలో కూడా కొనసాగింది. ప్రస్తుతం శ్రీజ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. శ్రవణ సాయి హైదరాబాద్‌లోని ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ ఒకే కాలనీలోనే ఉండటంతో ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిపోయింది. శ్రీజ తల్లిదండ్రులు ఈ ప్రేమకు వ్యతిరేకంగా ఉండేవారు.
శ్రీజ శ్రవణ సాయిని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తోందని తెలుస్తోంది. డిసెంబర్ 8 రాత్రి పెళ్లి విషయంపై మాట్లాడుదామని‘ శ్రీజ తల్లిదండ్రులు సాయిని తమ ఇంటికి పిలిచారు. సాయిని ఇంట్లోకి వెళ్లిన వెంటనే బ్యాట్లు, కత్తులతో దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలతో పడిపోయిన సాయిని, ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించి బంధువులు పారిపోయారు. అమీన్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర గాయాలకు చికిత్స పొందుతూ డిసెంబర్ 9 ఉదయం శ్రవణ్ సాయి మరణించాడు. మెడలో, తలపై గాయాలు, అధిక రక్తస్రావం కారణంగా మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపిసి సెక్షన్లు 302 (హత్య), 506 (బెదిరింపు) కేసు దాఖలు చేశారు. శ్రీజ తల్లి, తండ్రి, చెల్లెలు, చెల్లెలు భర్త మొత్తం ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. హత్యా ఆయుధాలు, రక్తం మరకలు ఉన్న దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. సిసిటివి ఫుటేజ్, సాయి మొబైల్ చాట్స్‌ను ఆధారంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది పరువు హత్యేనని నిందితులు కుల వ్యత్యాసాన్ని సహించలేక ఈ హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు.